Indian CEOs around the world: ఏ దేశమైనా తమ దగ్గర పుష్కలంగా ఉన్న వనరుల్ని విదేశాలకు ఎగుమతి చేయడం సహజం. 'భారతదేశపు ప్రధాన ఎగుమతి సీఈఓలు' అని సరిగ్గా పదేళ్ల క్రితం 'టైమ్' పత్రిక రాసినప్పుడు నిజానికి ఇంతమంది లేరు. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, రాజీవ్ సూరి లాంటి వాళ్లంతా ఆ తర్వాత సీఈఓలు అయిన వాళ్లే.
Indian CEOs in the world
మరెందుకలా రాసిందీ అంటే- అప్పటికి ఇంద్రా నూయి(పెప్సీ), శంతను నారాయణ్(అడోబ్), విక్రమ్ పండిట్(సిటీ గ్రూప్)... లాంటివాళ్లు సీఈఓలుగా ఉన్నారు. పేరొందిన బిజినెస్ స్కూల్స్ అయిన ఇన్‌సీడ్ (యూరప్), హార్వర్డ్(అమెరికా)లలోనూ కీలకపదవుల్లో భారతీయులే ఉండేవారు. దానికితోడు ఆ సంవత్సరం అజయ్‌సింగ్ బంగా మాస్టర్‌కార్డ్‌కి సీఈఓ అవగా, ఆయన సోదరుడు మన్విందర్ సింగ్ యూనిలీవర్‌లో ఉన్నతస్థానంలో ఉన్నారు. దాంతో టైమ్ పత్రిక 'వాళ్లమ్మ రోజూ పొద్దున్నే ఏం వండిపెట్టి పెంచిందో కానీ బంగా సోదరులు ఇంత గొప్పవాళ్లయ్యారు...' అని రాసింది. గ్లోబల్ బాసెస్‌కి భారత ఉపఖండం చక్కటి శిక్షణనిచ్చే మైదానమని తేల్చింది. అది పేర్కొన్నట్టుగానే ఆ తర్వాత భారతీయుల నియామకాలు ఇంకా ఇంకా పెరిగాయి. 2015లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం... సిలికాన్ వ్యాలీ ఇంజినీర్లలో మూడోవంతు, ప్రపంచ హైటెక్ కంపెనీల సీఈఓల్లో పది శాతం భారతీయులు. ప్రస్తుతం ఫార్చ్యూన్ 500 కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల(సీఈఓ)లో ముప్ఫైశాతం ఇక్కడ పుట్టి పెరిగినవాళ్లూ లేదా భారతీయ మూలాలు ఉన్నవాళ్లేనంటున్నాయి.
Indian CEOs of MNCs
Indian CEOs of tech companies
అధ్యయనాలు. గతేడాది ఆంధ్రప్రదేశ్‌కి చెందిన అరవింద్ కృష్ణ ఐబీఎం సీఈఓ కాగా, ఈ ఏడాది మొదట్లో తమిళనాడుకి చెందిన రఘు రఘురామన్ అమెరికా క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ వీఎంవేర్‌కి సీఈవోగా నియమితులయ్యారు. ఇక నవంబరు, డిసెంబరు మాసాల్లో పరాగ్ అగర్వాల్, లీనా నాయర్‌ల నియామకాలు 2021 సంవత్సరానికి సంతోషకరమైన ముగింపు పలికాయి.
హెచ్1బి వీసాలు మనకే
అమెరికా ఇచ్చే హెచ్-1బి వీసాల్లో డెబ్భై శాతానికి పైగా భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకే వెళ్తున్నాయి. అక్కడి జనాభాలో ఒక శాతం, సిలికాన్ వ్యాలీ సాంకేతిక నిపుణుల్లో ఆరు శాతం మాత్రమే ఉన్న భారతీయులు ఉన్నత పదవుల దగ్గరికి వచ్చేసరికి అందరికన్నా ఎక్కువగా ఉండడం... ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది.
ట్విటర్ సీఈఓగా పరాగ్ అగర్వాల్ నియమితులు కాగానే 'భారతీయ ప్రతిభతో అమెరికా లబ్ధి పొందుతోంది' అని ట్వీట్ చేశారు ఎలన్‌మస్క్. 'ఇది ఇండియన్ సీఈఓ వైరస్' అన్నారు ఆనంద్ మహీంద్రా. ఇప్పుడే కాదు, అంతర్జాతీయ స్థాయి వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో... కంపెనీల్లో, ఉద్యోగుల్లో, వినియోగదారుల్లో 'భారతీయ ప్రతిభ' ఎప్పుడూ చర్చనీయాంశమేనట. ఈ ఉన్నతస్థాయి నియామకాలు జరిగిన ప్రతిసారీ 'వాళ్లే ఎందుకు...' అని ప్రశ్నించడం ఒక అలవాటుగా మారిందట. అంతేకాదు, ఈ విషయంమీద ఎన్నో అధ్యయనాలూ జరిగాయి, పుస్తకాలూ వచ్చాయి. అవన్నీ ఏం చెబుతున్నాయీ అంటే...
అవసరమే ప్రధానం
మాంసాహార ప్రియులకి... అదీ రొయ్యలూ పీతలూ లాంటి సీఫుడ్ ఇష్టపడేవారికి నత్తలతో చేసే రకరకాల వంటకాలూ నచ్చుతాయి. అయితే నత్తలు కాస్త లావుగా కండపట్టి ఉంటేనే రుచిగా నోరూరిస్తాయి. కానీ సహజమైన వాతావరణంలో పెరిగే నత్తలు అంతలావుండవు. అందుకని వాటిని ట్యాంకుల్లో ప్రత్యేకంగా పెంచుతారు. వాటితోపాటు ఆ ట్యాంకులో ఒక రొయ్యనీ వదులుతారు. ఆ రొయ్యకి ఆహారం కాకుండా తమను తాము కాపాడుకోవడానికి నత్తలు బాగా తిని బలంగా లావుగా తయారవుతాయట. ఈ పరిస్థితే మేనేజ్‌మెంట్ వృత్తికీ వర్తిస్తుందంటారు నిపుణులు.
మేనేజ్‌మెంట్ అంటేనే - ఏ పక్కనుంచి ఎప్పుడే సమస్య వస్తుందో తెలియదు. ముందుగా దాన్ని అర్థం చేసుకోవాలి. పరిష్కరించడానికి సరైన మార్గాన్ని ఎంచుకుని ఆచరించాలి. ఎన్ని ఎక్కువ సమస్యల్నీ, సవాళ్లనీ పరిష్కరించగలిగితే అంతగా రాటుదేలి అనుభవజ్ఞులైన, నిపుణులైన మేనేజర్లుగా పేరు తెచ్చుకోగలుగుతారు. అలాంటి మేనేజర్లని తయారుచేసే కర్మాగారం భారతదేశం... అంటోంది ప్రపంచం.
మన దేశంలో ఆరు వేలకు పైగా మేనేజ్‌మెంట్ శిక్షణ సంస్థలున్నాయి. వీటి నుంచి ఏటా రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు మేనేజ్‌మెంట్ డిగ్రీలతోనో, డిప్లొమాలతోనో బయటకు వస్తున్నారు. ఇంత ఎక్కువమంది మరే దేశంలోనూ కన్పించరు. మరి మన దేశానికి ఇదెలా సాధ్యమైందీ అంటే- స్వాతంత్య్రానికి ముందే ఇక్కడ సివిల్ సర్వీసులూ రైల్వేలూ సైన్యమూ వ్యవస్థలుగా స్థిరపడ్డాయి. వాటివల్ల వృత్తినిపుణులు తయారయ్యారు. స్వాతంత్య్రం వచ్చాక సహజంగానే వారి చొరవతో కొత్త పరిశ్రమలూ వ్యాపారాలూ రావడంతో కార్పొరేట్ మేనేజ్‌మెంట్ నిపుణుల అవసరం తలెత్తింది. కానీ మేనేజ్‌మెంట్ అనేది ప్రత్యేకమైన విద్యగా శిక్షణ ఇవ్వడం ఆరోజుల్లో లేదు. దాంతో వివిధరంగాల్లో నిపుణులైనవారు ప్రత్యేకంగా పాఠ్యాంశాలనూ బోధనాపద్ధతులనూ రూపొందించారు. 1949లో జంషెడ్‌పూర్‌లో ప్రారంభించిన జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్‌స్టిట్యూట్(ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ) మనదేశంలో మొట్టమొదటి బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల. ఆ తర్వాత 1953లో కలకత్తాలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్‌ను నెలకొల్పారు. హిందుస్థాన్ లీవర్ లాంటి పెద్ద సంస్థల్లో మేనేజర్లుగా పేరొందిన ప్రకాశ్ టాండన్, కెఎస్ బసు, కెటి చాంది లాంటి వాళ్ల సహకారంతో యాభయ్యవ దశకంలోనే ఐఐఎంలు కూడా ప్రారంభమయ్యాయి.
అవకాశాలేవీ?
ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలూ వాటిల్లో చదువుకుని పట్టభద్రులవుతున్న వారి సంఖ్యా పెరిగింది కానీ దానికి తగ్గట్టుగా దేశంలో అవకాశాలు పెరగలేదు. దాంతో సహజంగానే వారి చూపు విదేశాల వైపు మళ్లింది. ఇక్కడి నుంచి వలసవెళ్లిన తొలితరం విద్యావంతులు అమెరికాలో ఇంజినీర్లుగా, డాక్టర్లుగా, శాస్త్రవేత్తలుగా స్థిరపడ్డారు. భారతీయ ప్రతిభ సత్తా చూపడం మొదలుపెట్టారు. 1990వ దశకంలో ఆర్థిక సంస్కరణల తర్వాత వేగంగా మారుతున్న వినియోగదారుల మార్కెట్పై యువతరానికి అవగాహన పెరిగింది. స్థానికంగానూ, అంతర్జాతీయంగానూ పోటీ పడాల్సిన అవసరం తెలిసొచ్చింది. మరోపక్క అదే సమయంలో విదేశీ గడ్డపై ఇంటర్నెట్ ఆధారిత, టెక్నాలజీ రంగాల్లో అవకాశాలు బాగా పెరిగాయి. అక్కడ కంపెనీలు ఉన్నాయి, పనిచేయడానికి ప్రతిభావంతులు కావాలి. మనకి ప్రతిభ ఉంది, అవకాశాలు లేవు. దాంతో పరస్పరం లబ్ధిపొందడం మొదలైంది. 'ఎంచుకున్న ఏ రంగమైనా సరే- సంపాదనాపరంగా, హోదాపరంగా పైకెదగాలన్న ప్రగాఢమైన కాంక్ష భారతీయులకు ఎక్కువ... దాన్ని నెరవేర్చుకునే క్రమంలో ఎన్ని అవాంతరాలనైనా ఓపిగ్గా అధిగమిస్తారు...' అంటారు 'ద మేడిన్ ఇండియా మేనేజర్' పుస్తక రచయిత గోపాలకృష్ణన్. 'భారతదేశంలో పెరగడమే వారిని నిపుణులైన మేనేజర్లుగా తీర్చిదిద్దుతోంది' అంటారాయన. భారతదేశం విభిన్న సంస్కృతులూ భాషల సమ్మేళనం. ఇక్కడినుంచి అమెరికా వెళ్లి సీఈఓలు అయినవాళ్లలో అన్ని రాష్ట్రాలవాళ్లూ, అన్ని వర్గాలవాళ్లూ ఉన్నారు. ఆ ప్రత్యేకతే పరిశీలకులను ఆలోచింపజేస్తోంది. సంస్థల చేత అధ్యయనాలు చేయిస్తోంది. వారంతా కలిసి భారతీయులు గ్లోబల్ మేనేజర్లుగా తయారవడానికి దారితీస్తున్న కొన్ని ముఖ్యమైన అంశాలను క్రోడీకరించారు. అవేంటంటే...
కష్టపడతారు...
పుష్కరం క్రితం గణేశ్ అయ్యర్ ఎంఫసిస్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించేముందు తనని తాను ప్రశ్నించుకున్నారట- సీఏ చదివిన తాను టెక్నాలజీలో ఓనమాలు తెలియకుండా టెక్ కంపెనీకి సారథ్యం వహించగలనా అని. అందుకని 48ఏళ్ల వయసులో ఆయన తన జూనియర్ల దగ్గర ముందుగా ఫేస్‌బుక్ ఎలా వాడాలో నేర్చుకున్నారట. ఆ నేర్చుకోవడాన్ని అలాగే కొనసాగిస్తూ సంస్థకి సంబంధించిన సాంకేతిక విషయాలన్నిటిమీదా పట్టు సాధించి, ఆ క్రమంలో తన అహాన్నీ, అజ్ఞానాన్నీ, ఓటమి భయాన్నీ వెనక్కి నెట్టి కంపెనీని ముందుకు తీసుకెళ్లానంటారు. నిజానికి సీఈఓగా సంస్థ బ్రాండ్ విలువను పెంచడమే ఆయన పని. దానికి టెక్నాలజీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ తాను పనిచేసే సంస్థ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండటం తన కర్తవ్యం అనుకున్న ఆయన కష్టపడి కొత్త విద్యని నేర్చుకున్నారు. ఇలా కష్టపడి పనిచేయడమనేది భారతీయుల డీఎన్‌ఏలోనే ఉందంటారు పరిశీలకులు. భారతదేశంలో పెరిగే పిల్లలకు చిన్నవయసు నుంచే పోటీ ఎదురవుతుంది. ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకైతే ఏకంగా వెయ్యి సీట్లకి లక్షమంది పోటీపడతారు. దాంతో పది పన్నెండేళ్ల వయసునుంచే తల్లిదండ్రులు పిల్లలకు లక్ష్యాన్ని నిర్దేశించి తదనుగుణంగా శిక్షణ ఇప్పించడం మొదలెడతారు. నిజానికి భారత్‌లోని ఐఐటీల్లో సీటు తెచ్చుకోవడం కన్నా హార్వర్డ్‌లోనో, ఎంఐటీలోనో సీటు తెచ్చుకోవడం తేలిక. అయినా వాళ్లు ఐఐటీల్లో చదవడానికే ఇష్టపడతారు. అందుకే ప్రతిభావంతులుగా రాణించగలుగుతున్నారు- అంటారు పరిశీలకులు.
పెంపకం
ఐఐటీలో మంచిమార్కులతో పాసైన సుందర్ పిచాయ్‌కి స్టాన్‌ఫర్డ్‌లో సీటొచ్చింది కానీ, ఫ్లైట్ టికెట్ కొనుక్కోవడానికి డబ్బులేదు. 'అప్పుడు టికెట్ ధర మా నాన్న ఏడాది జీతంతో సమానం. ఎలాగో కష్టపడి ఆయన డబ్బు సమకూరిస్తే మొదటిసారి విమానమెక్కి అమెరికా వచ్చాను. ఆయన నెల జీతంతో ఇక్కడ నాకు ఒక బ్యాక్‌ప్యాక్ వచ్చేది. ఇంటికి ఫోన్ చేస్తే రెండు డాలర్లయిపోతాయని మాట్లాడకుండా నిగ్రహించుకునేవాణ్ణి. ఇక్కడికొచ్చేదాకా సొంత కంప్యూటర్ లేదు...' అని చెప్పే ఆయన 2004లో గూగుల్‌లో మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌గా చేరి పదకొండేళ్లకు ఆ సంస్థ సీఈఓ అయ్యారు.
భారతీయ కుటుంబవ్యవస్థా మధ్యతరగతి విలువలూ వారిని అందరికన్నా ఒక మెట్టుపైన నిలిచేలా చేస్తున్నాయన్నది మరో పరిశీలన. చదువే ఆస్తిగా పరిగణించి పిల్లల్ని బాగా చదువుకునేలా ప్రోత్సహించడం, ఆ చదువు పూర్తయ్యేదాకా కుటుంబం అండగా నిలవడంవల్ల వారికి బాల్యంనుంచే క్రమశిక్షణా నైతిక విలువలూ అలవడుతున్నాయి. కష్టపడి చదువుతారు కాబట్టే వృత్తికి ప్రాధాన్యమిస్తారు, పని పట్ల నిబద్ధతనీ సంస్థ పట్ల విశ్వాసాన్నీ కనబరుస్తారు. భారతీయ సీఈఓల్లో ఎక్కువమంది దశాబ్దాల తరబడి ఆ కంపెనీలోనే పనిచేసినవారై ఉండడానికి కారణమదే. అమెరికన్ సీఈఓలకీ భారతీయులకీ తేడా కూడా అదే. అమెరికన్లు డబ్బు సంపాదించడమెలా అని మాత్రమే చూస్తారు. కానీ భారతీయులైతే కంపెనీకీ వినియోగదారులకీ మధ్య అనుబంధాన్ని నెలకొల్పుతారు... అంటున్నారు పరిశీలకులు.
హే గ్రూప్ అనే సంస్థ చేసే లీడర్‌షిప్ సర్వేలో ఒక ముఖ్యమైన అంశం ఉంది- నీతీ నిజాయతీ లాంటి విలువలవల్ల వచ్చే మనోబలం ఎంతవరకూ నాయకత్వ లక్షణాలను ప్రభావితం చేస్తుందన్నది ఈ సంస్థ పరిశీలిస్తుంది. అందులో తేలిందేమిటంటే- క్రైస్తవ, బౌద్ధ సన్యాసులకు ఏ స్థాయిలో మనో నిబ్బరముంటుందో భారతీయ సీఈఓలకూ ఆ స్థాయిలో ఉందట.
సదుపాయాల లేమి
బర్త్ సర్టిఫికెట్ నుంచి ఇన్‌కమ్ సర్టిఫికెట్ వరకూ వ్యాక్సినేషన్ నుంచి ఓటు హక్కు పొందడం దాకా స్కూలు అడ్మిషన్లనుంచి ఉద్యోగానికి దరఖాస్తు చేసేదాకా, ఆఖరికి అమెరికా వీసా లాటరీతోసహా అడుగడుగునా భారతీయులు ఎన్నో అవాంతరాలను ఎదుర్కొనాల్సి వస్తుంది. అరకొర వసతులు, అస్తవ్యస్త వ్యవస్థల మధ్య లౌక్యంగా తమ పనులు చేసుకునే అనుభవం వారిని సహజమైన మేనేజర్లుగా తీర్చిదిద్దుతోందంటారు నిపుణులు. మాస్టర్‌కార్డ్ సీఈఓ అయిన అజయ్ బంగా మొదట చెన్నైలో సిటీబ్యాంక్‌లో పనిచేశారు. 'తెల్లారి లేస్తే పంపులో నీళ్లొస్తాయో లేదో తెలీదు. ఆఫీసుకెళ్తే ఎప్పుడు కరెంటు పోతుందో తెలియదు. ఆ అనిశ్చితి బ్యాకప్ విలువని నేర్పింది. మా బ్యాంకులో డేటా బ్యాకప్‌కి సేఫ్‌సైడ్‌గా కనీసం నాలుగు బ్యాకప్‌లు ఉంచుకునేవాళ్లం. దాని నిర్వహణలో ఎంత సమయమూ మానవ వనరులూ వృథా అయ్యేవో' అని చెప్పేవారాయన. 'పరిమిత వనరులనుంచి సాధ్యమైనంత ఎక్కువ లబ్ధి పొందడానికి ఎన్నిరకాలుగా ప్రయత్నించాలో అన్నిరకాలుగానూ ప్రయత్నిస్తారు. సృజనాత్మకంగా ఆలోచించి పని జరుపుకోవడం భారతీయులకి తప్పనిసరి. వ్యవస్థలో ఉన్న అవినీతీ అక్రమాల వల్ల అనుకున్నది జరుగు తుందన్న గ్యారంటీ లేదు. అందుకని ఎలాంటి ఫలితానికైనా సిద్ధంగా ఉంటారు. ప్రతిచోటా ప్లాన్ బి సిద్ధంగా ఉంచుకుంటారు. అదే వారికి పెద్ద ప్లస్ పాయింట్...' అంటుంది హే గ్రూప్ సర్వే.
సర్దుకుపోయే తత్వం
గతేడాది ఐబీఎం సీఈఓ అయిన అరవింద్ కృష్ణ ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాలో పుట్టారు. తండ్రి సైన్యంలో పని చేయడం వల్ల ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం తమిళనాడులోని కూనూరులో మొదలైంది. డూన్ స్కూల్లో హైస్కూలు చదువు పూర్తిచేసి కాన్పూర్ ఐఐటీలో ఇంజినీరింగ్ చదివారు. అమెరికా వెళ్లి పీహెచ్‌డీ చేసి ఐబీఎంలో చేరారు. చదువు పూర్తయ్యేలోపే భిన్న సంస్కృతులూ భాషల మధ్య ఇన్ని ప్రాంతాలు తిరగడం చాలామంది భారతీయులకు అలవాటే. విభిన్న సంస్కృతులకూ సంప్రదాయాలకూ నిలయమైన దేశం కావడంతో పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోవడం, కొత్తదనాన్ని స్వీకరించడం, భిన్న స్వభావాల వ్యక్తులమధ్య సహనంతో వ్యవహరించడం... వారికి స్వతహాగా అలవడుతున్నాయన్నది మరో ముఖ్యమైన పరిశీలన. ఈ అనుభవం వారికి బయట మార్కెట్‌ని అర్థం చేసుకోడానికే కాదు, సంస్థ లోపల సిబ్బందిని అర్థంచేసుకోడానికీ ఉపయోగపడుతోంది.
సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓ అయినప్పుడు సంస్థలో పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. బిల్‌గేట్స్ ఉద్యోగుల్ని చులకనచేసి మాట్లాడేవాడనీ, బామర్ వ్యాపారధోరణి భాగస్వాములకు నచ్చేది కాదనీ అనుకునేవారు. దాంతో స్మార్ట్‌ఫోన్ల వ్యాపారంలో మైక్రోసాఫ్ట్ వెనకబడిపోయింది. ఆ సమయంలో సీఈఓ అయిన సత్య మొదట మైక్రోసాఫ్ట్ సంస్కృతిని మార్చడంపై దృష్టిపెట్టారు. సమావేశాల్లో అరుపులూ ఆవేశాలకూ తావులేకుండా చేశారు. ఈ ధోరణి మొత్తంగా సంస్థ ముఖచిత్రాన్నే మార్చేసింది. 300 బిలియన్ డాలర్లుండే సంస్థ మార్కెట్ విలువ ఇప్పుడు 2.5 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది.
సుందర్ పిచాయ్ గూగుల్‌లో చేరేసరికి అక్కడా క్రమశిక్షణ అనేది కొంచెం కూడా కనిపించేది కాదు. విపరీతమైన స్వేచ్ఛ ఉద్యోగుల మధ్య అనారోగ్యకరమైన సంబంధాలకు కారణమయ్యేది. సుందర్ తనవైన పద్ధతుల్లో మెల్లగా దాన్ని ఒక దారిలోకి తెచ్చారు. రెండు ట్రిలియన్ డాలర్ల సంస్థగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ట్విటర్ పరిస్థితీ అదే. అందుకే భారతీయుడైన పరాగ్ అగర్వాల్‌కి సంస్థ డైరెక్టర్లు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు.
భాషానైపుణ్యాలు
చిన్నప్పటినుంచీ ఇంగ్లిష్ మీడియం చదువు వల్ల భారతీయులకు ఆంగ్లంపై పట్టు ఉండటమూ మరో ప్లస్ పాయింటైంది. అది మేనేజ్‌మెంట్ పదవులకు చాలా అవసరమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంచుతోందనీ ఇళ్లల్లో పెద్దవాళ్లు లెక్కలకు ఇచ్చే ప్రాధాన్యం కూడా వారి ప్రతిభకు మెరుగులు దిద్దుతోందనీ, టెక్నాలజీ విషయాల్లో పైచేయి సాధించగలుగుతున్నారనీ అంటున్నారు నిపుణులు.
'స్వదేశంలో ఉండే సామాజిక హోదానీ గుర్తింపునీ వదిలి ఒంటరిగా విదేశానికి వెళ్లినప్పుడు అక్కడ స్థానబలం, మిత్రబలం లాంటివేవీ ఉండవు. ఆ ఎరుకే వారిని మర్యాదగా, వినయంగా నడచుకునేలా చేస్తోంది. దాంతో అందరి అభిమానాన్నీ చూరగొంటున్నారు. వారి సాంకేతిక నైపుణ్యాలకు ఈ ప్రవర్తనా పద్ధతులన్నీ తోడవడం వల్లనే భారతీయులు గొప్ప మేనేజర్లుగా రాణించగలుగుతున్నార'ని తీర్మా నించింది గ్లోబల్ హెచ్‌ఆర్ సంస్థ హే గ్రూప్. ఇంద్రనూయి పెప్సీ సీఈఓగా నియమితులు కాగానే బంధుమిత్రులంతా ఇండియాలో ఉన్న ఆమె తల్లిని కలిసి అభినందించారట. ఎంతో సహజంగా జరిగిన ఆ చిన్న సంఘటన సీఈఓగా నూయి దృక్పథాన్ని మార్చిందట. కంపెనీలో బాగా పనిచేసే ఉద్యోగుల కుటుంబాలకు ఆమె ప్రత్యేకంగా 'థ్యాంక్‌యూ' లేఖలు పంపించేవారు. పెంపకమే ఒక ఉద్యోగి సామర్థ్యాన్ని తీర్చిదిద్దుతుంది కాబట్టి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలియజేయడం చాలా ముఖ్యమని భావించానంటారామె. ఆ ఆత్మీయబంధమే పన్నెండేళ్ల సుదీర్ఘకాలం ఆమెను సీఈఓ స్థానంలో ఉంచింది. ఒక వలసదారుగా కొత్త దేశానికి వెళ్లి ఉద్యోగంలో నిలదొక్కుకుని అంచెలంచెలుగా సంస్థ సారథ్యం వహించే స్థాయికి ఎదగ గలగడమంటే... దాని వెనకాల ఇన్ని విషయాలున్నాయన్నమాట! అందుకే మరి... ప్రపంచం మనవాళ్ల వైపు చూస్తోంది!
ఇదీ చదవండి: Why Rupee is falling: రూపాయీ.. ఎందుకు పడుతున్నావ్?