మిగులు విద్యుత్ హోదా ఈ సారి కూడా భారత్‌కు దక్కలేదు. 2018-19 సంవత్సరానికి గరిష్ఠ డిమాండ్ ఉన్న సమయంలో 0.8 శాతం విద్యుత్ లోటు ఉంది. మొత్తం మీద ఈ లోటు 0.6 శాతంగా ఉంది.
కేంద్ర విద్యుచ్ఛక్తి ప్రాధికార సంస్థ(సీఈఏ) 2018-19కి తయారుచేసిన లోడ్జనరేషన్ బ్యాలెన్సింగ్ నివేదిక ప్రకారం మొత్తం మీద మిగులు విద్యుత్ 4.6 శాతం ఉండగా... గరిష్ఠ డిమాండ్ సమయంలో ఇది 2.5 శాతంగా ఉంది. దీని ప్రకారం భారత్ మిగులు విద్యుత్ దేశంగా మారుతుందని తెలిపింది.
కానీ తాజా గణాంకాలు మాత్రం మరోలా ఉన్నాయి. గరిష్ఠంగా 177.02 గిగావాట్లు డిమాండ్ ఉన్న సమయంలో 175.52 గిగావాట్ల విద్యుత్ సరఫరా అయింది. దీని ప్రకారం లోటు 1.49 గిగావాట్లు. ఇది 0.8 శాతంతో సమానం.
మొత్తం మీద 1,267.29 బీయూ(బిలియన్ యూనిట్లు) విద్యుచ్ఛక్తి సరఫరా చేశారు. కానీ డిమాండ్ 1,274.56 బీయూల డిమాండ్ ఉంది. అనగా లోటు 0.6 శాతం(7.35బియూలు)
2017-18లోనే భారత్ మిగులు విద్యుత్ దేశంగా మారుతుందని సీఈఏ మొదట అంచనా వేసింది. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం విద్యుత్ లోటు 0.7 శాతం, గరిష్ఠ డిమాండ్ సమయంలో లోటు 2.1 శాతంగా నమోదైంది.
"కరెంటు సరఫరా చేసే డిస్కంలు విద్యుత్‌ను కొనలేకపోవటం వల్లే ఈ లోటు నమోదైంది. ఈ జనవరి వరకు వాటి అప్పులు రూ. 40వేల కోట్లున్నాయి. భారత్‌లో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 356 గిగావాట్లుగా ఉంది. అదే సమయంలో గరిష్ఠ డిమాండ్ మాత్రం 177 గిగావాట్లు మాత్రమే. బాకీలు చెల్లించినట్లయితే విద్యుత్ ఉత్పత్తిని రెట్టింపు చేయవచ్చు" - విద్యుత్ రంగ నిపుణులు.