ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ భారత వ్యాపారాలు భారీగా పుంజుకున్నట్లు ఆ సంస్థ సీఈఓ టిమ్‌కుక్ వెల్లడించారు. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో తమ వ్యాపారాలు రెండింతలైనట్లు వివరించారు. 2020 సెప్టెంబర్ 23న సంస్థ ఆన్లైన్ స్టోర్‌ను ప్రారంభించడం ఇందుకు కలిసొచ్చినట్లు తెలిపారు. భవిష్యత్‌లో రిటైల్ స్టోర్ ప్రారంభించడం ద్వారా తమ వ్యాపారాలు మరింత పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రీమియం స్మార్ట్ఫోన్ల విభాగంలో శాంసంగ్, వన్‌ప్లస్ వంటి సంస్థల నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్న యాపిల్ విక్రయాలు 2020లో భారీగా పెరిగాయి. అయినప్పటికీ.. తమకున్న అవకాశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువేనని టిమ్‌కుక్ అభిప్రాయపడ్డారు. కంపెనీ త్రైమాసిక లభాల ప్రకటన సందర్భంగా ఈ వివరాలు వెల్లడించారు.
ఆదాయం ఆల్‌టైం రికార్డ్..
2020 డిసెంబర్ 26తో ముగిసిన త్రైమాసిక ఆదాయం తొలిసారి 111.4 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు యాపిల్ ప్రకటించింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 21 శాతం అధికమని తెలిపింది.
ఇందులో అంతర్జాతీయ విక్రయాల వాటా 64 శాతంగా ఉన్నట్లు వివరించింది.