విమాన ప్రయాణికులకు వరుస ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత రెండు రోజులుగా చెక్ ఇన్ సాఫ్ట్వేర్ సమస్యతో ఎయిరిండియా విమాన సర్వీసుల జాప్యం అయిన విషయం విదితమే. తాజాగా.. దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ అలాంటి సమస్య తలెత్తింది.
ఇమిగ్రేషన్ తనిఖీ వ్యవస్థలో సాంకేతిక సమస్యతో సర్వర్.. అర్ధరాత్రి 12.20 గంటలకు నిలిచిపోయింది. పరిష్కారం కోసం ఎంత సమయం పడుతుందనేది చెప్పకపోవడం వల్ల ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. గంటల కొద్దీ లైన్లలో వేచి ఉన్నారు.
సమస్య సర్దుబాటు...
అర్ధరాత్రి నుంచి పడిగాపులు గాసిన ప్రయాణికులు.. సమస్య పరిష్కారంతో ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం నుంచి ఇమిగ్రేషన్ తనిఖీ వ్యవస్థ పనిచేస్తుందని తెలిపారు అధికారులు. సర్వర్ నిలిచిపోయిన సమయంలో 6 విమానాలు అర్ధగంటకుపైగా.. మరో 2 గంటకుపైగా ఆలస్యమయ్యాయని పేర్కొన్నారు.
విమానాల జాప్యంతో విసిగిపోయిన ప్రయాణికులు.... ఇమిగ్రేషన్ ప్రక్రియ ఆలస్యంపై సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదు చేశారు. క్యూల్లో బారులు తీరిన ప్రయాణికుల ఫోటోలనూ పంచుకున్నారు.
ఇందిరా గాంధీ ఎయిర్పోర్ట్.. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటి.
ఇదీ చూడండి: 'మోదీకి కుల రాజకీయ రంగు పులమొద్దు'