ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది తమ ఉద్యోగుల్లో ఏ ఒక్కరినీ తొలగించబోమని పేర్కొంది. అయినే ఉద్యోగులకు మాత్రం ఈ ఏడాది ఎలాంటి వేతనాల పెంపు ఉండబోదని స్పష్టం చేసింది. అంతేకాకుండా 40 వేల ఉద్యోగాల్లో కేవలం ఫ్రెషర్లనే నియమించుకోనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ అనంతరం.. పెద్ద ఎత్తున ఉద్యోగాల్లో కోత ఉండబోతోందన్న వార్తలను ఖండించింది టీసీఎస్.
మార్చితో ముగిసిన త్రైమాసికంలో సంస్థ లాభాలు నమోదు చేసిందని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు త్రైమాసికాల్లో మాత్రం పరిస్థితులు అంత అనుకూలంగా ఉండబోవని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం అన్ని విభాగాల్లో కలిపి దాదాపు 4.5 లక్షల మంది పనిచేస్తున్నారని.. ఏ ఒక్కరినీ తొలగించబోమని టీసీఎస్ ఎండీ, సీఈవో రాజేశ్ గోపీనాథ్ స్పష్టం చేశారు.
జూన్‌తో విద్యా సంవత్సరం ముగుస్తుందని.. ఇప్పటికే ఎంపికైన ఫెషర్లు ఆ తర్వాత విధుల్లోకి చేరతారని సంస్థ తెలిపింది. కరోనా పరిస్థితుల వల్ల ఈ ఏడాది ఉద్యోగులెవరికీ వేతనాల పెంపు ఉండబోదని స్పష్టం చేసింది. గురువారం జనవరి-మార్చి 2019-20 త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించింది. నికర లాభాల్లో కాస్త క్షీణతను నమోదైనట్లు వెల్లడించింది. గతేడాది ఇదే సమయంలో రూ.8,126 కోట్ల ఏకీకృత నికర లాభం ఉండగా.. ఈ సారి అది రూ.8049 కోట్లకు పరిమితమైంది.
ఇదీ చదవండి:కరోనా హాట్‌స్పాట్‌కు వెళ్లారని ఇంట్లోకి నో ఎంట్రీ!