కార్ల ధరలు పెంచిన వాహన తయారీ సంస్థల జాబితాలో హుందాయ్ మోటార్స్(హెచ్ఎంఐఎల్) కూడా చేరింది. వచ్చే ఏడాది జనవరి నుంచి హుందాయ్ అన్ని మోడళ్ల ధరలు పెరగనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ముడి సరుకుల ధరలు పెరగటమే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది.
వివిధ మోడళ్లు, ఇంధనం రకాల (పెట్రోల్, డీజిల్ వేరియంట్లు) ఆధారంగా ధరల పెరుగుదల వేర్వేరుగా ఉండనున్నట్లు హుందాయ్ స్పష్టం చేసింది. అయితే ఏ మోడల్ ధర ఎంత పెరుగుతుందనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. ఈ నెలాఖర్లోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపింది.
ఆటోమొబైల్ దిగ్గజాలైన మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ ఇప్పటికే తమ కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ కంపెనీలు కూడా 2020 జనవరి నుంచే పెరిగిన ధరలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించాయి.