స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో యాపిల్‌ను వెనక్కినెట్టింది చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజం హువావే. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో జరిగిన భారీ అమ్మకాలతో స్మార్ చరవాణుల మార్కెట్లో రెండో స్థానంలో నిలిచింది.
గతేడాదితో పోలిస్తే 2019 మొదటి 3 నెలల్లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 6.6 శాతం క్షీణించి 310.8 మిలియన్ల విక్రయాలు నమోదయ్యాయి. స్మార్ట్ఫోన్ల అమ్మకాలు క్షీణించడం ఇది వరుసగా ఆరో త్రైమాసికం.
ఇందుకు భిన్నంగా విక్రయాల్లో హువావే రాణించింది. మొత్తం 50.3 శాతం వృద్ధిని సాధించింది. 59.1 మిలియన్ యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచింది.
71.9 మిలియన్ యూనిట్ల అమ్మకాలతో సామ్సంగ్ మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే సామ్సంగ్ అమ్మకాలు 8.1 శాతం క్షీణించాయి.
అమెరికాకు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ విక్రయాలు 30.2 శాతం తగ్గి మార్కెట్లో మూడో స్థానానికి పడిపోయింది.
చైనా కేంద్రంగా పని చేస్తున్న అంతర్జాతీయ డాటా కార్పొరేషన్ (ఐడీసీ) తాజా గణాంకాల్లో ఈ వివరాలు వెల్లడించింది.
ఈ ఏడాదీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ గడ్డు పరిస్థితుల్నే ఎదుర్కోవచ్చని.. హువావే మాత్రం మంచి వృద్ధిని సాధిస్తుందని ఐడీసీ అంచనా వేసింది.
అయితే స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో తగ్గుదలకు ప్రధాన కారణం నూతన మోడళ్లు, రాబోయే తరం 5జీ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులపై వినియోగదారుల అంచనాలే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: భారీగా తగ్గిన శామ్సంగ్ ఆదాయం