స్మార్ట్ హంగులున్న టీవీలకు వినియోగదారుల ఆదరణ పెరుగుతోంది. సంప్రదాయ టీవీలను కాదని స్మార్ట్ టీవీలే కావాలని కోరుకునేవారి సంఖ్య పెరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం స్మార్ట్ టీవీల ఫీచర్లేనంటున్నారు వ్యాపారులు.
అప్పుడలా...
భారత్లో స్మార్ట్ టీవీ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. గతంలో స్మార్ట్ టీవీలు కొనాలంటే కొన్ని బ్రాండ్స్ మాత్రమే ఉండేవి. అయితే వాటికోసం రూ. 50 వేల నుంచి లక్షల్లో వెచ్చించాల్సి వచ్చేది.
వాటి రాకతో....
కొత్త టీవీ బ్రాండ్లు మార్కెట్లో అడుగుపెట్టాక రేట్లు దిగివచ్చాయి. మధ్యతరగతి ప్రజలు బ్రాండెడ్ టీవీల కన్నా తక్కువ ధరలో అన్ని ఫీచర్స్ ఉండే టీవీలు కొనేందుకు ఇష్టపడుతున్నారు. పాత టీవీలను మార్చేవారంతా ఆండ్రాయిడ్ టీవీలనే కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు.
"ఎక్కువ మంది వినియోగదారులు స్మార్ట్ టీవీల కొనుగోలుకే మొగ్గుచూపుతున్నారు. దాదాపు అన్ని బ్రాండ్ల ధరలు తగ్గాయి. బిల్ట్ ఇన్ వైఫైతో ఇంట్లో ఉండే వైఫైను అనుసంధానం చేసుకునే వీలుంది. గూగుల్, యూట్యూబ్ బ్రౌజ్ చేసుకోవచ్చు. స్మార్ట్ టీవీ ఉండటం వల్ల ఇది ప్రధాన ఉపయోగం. 43 అంగుళాల టీవీలపై వినియోగదార్లు ఇప్పుడు ఆసక్తి చూపుతున్నారు. ఇంతకు ముందు 32 అంగుళాలపై ఆసక్తి ఉండేది. ఎక్కువగా మధ్యస్థ తెర టీవీలు కావాలంటున్నారు వినియోగదార్లు. నెలవారీ వాయిదాల్లో చెల్లింపులను చాలా టీవీ బ్రాండ్లు అనుమతిస్తున్నాయి. ఈ అంశం వినియోగదార్లకు అవకాశాలు పెంచడం సహా అనుకూలంగా ఉంటోంది." --- మహమ్మద్ జావెద్ అలీ, వ్యాపారి
'స్మార్ట్' రారాజు...
దేశీయ టీవీ మార్కెట్ విలువ రూ.50వేల కోట్లు. అందులో స్మార్ట్ టీవీ వాటా క్రమంగా పెరుగుతోంది. గత రెండేళ్లలోనే స్మార్ట్ టీవీ మార్కెట్ 40 శాతం వృద్ధి చెందింది. వచ్చే రెండేళ్లలో ఈ మార్కెట్ మరింతగా విస్తరించి, ప్రతి ఇంట్లో స్మార్ట్ టీవీ వచ్చే అవకాశాలున్నాయన్నది మార్కెట్ వర్గాల మాట.
ఓటీటీని అనుసంధానం చేసుకుని స్మార్ట్ టీవీల్లో సినిమాలు చూసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వినియోదారులకు కంటెంట్ అందించడానికి హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సోనీ లైవ్, హంగామా వంటి ఓటీటీలతో కంపెనీలు ప్రత్యేక ఒప్పందాలు చేసుకుంటున్నాయి.