అన్లైన్ పేకాటలో రూ.38 కోట్ల కంపెనీ సొమ్మును వినియోగించుకున్న అరోపణలతో గోల్డ్‌మన్ శాక్స్ ఉపాధ్యక్షుడు అశ్వణి జున్జున్ వాలాను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.
గోల్డ్‌మాన్ శాక్స్ ఉద్యోగి అభిషేక్ ప్రశీరా ఇచ్చిన.. ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జున్జున్ వాలాపై పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. త్వరలో కోర్టులో హాజరుపరచనున్నట్లు స్పష్టం చేశారు.
అభిషేక్ ఫిర్యాదులో ఏముందంటే..
జన్జున్ వాలా తన జూనియర్ ఉద్యోగులైన గౌరవ్ మిశ్రా, అభిషేక్ యాదవ్, సుజిత్ అప్పయ్య అనే వ్యక్తులకు సంబంధించిన ఆఫీస్ కంప్యూటర్లను రివ్యూ పేరుతో వాడుకునేవాడు. ఇలా కంప్యూటర్ వినియోగిస్తూ.. వారి కంప్యూటర్లతో కంపెనీ ఖాతాలోకి అక్రమంగా లాగ్ అయ్యి.. తనకు అనుకూల మైన బ్యాంక్ ఖాతాలోకి డబ్బును బదిలీ చేసుకునే వాడు . ఇలా ఇప్పటి వరకు చైనా పారిశ్రమామిక, వాణిజ్య బ్యాంకు ఖాతాకు.. అక్రమంగా రూ.38 కోట్లు బదిలీ చేసుకున్నాడు.
గతంలో ఇలాంటి మోసాలకు పాల్పడి ఉద్యోగం కోల్పోయిన వేదాంత్ అనే వ్యక్తి హస్తం ఈ అక్రమ లావాదేవాల్లో ఉన్నట్లు అభిషేక్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
సీసీ టీవీ ఫుటేజీలు స్వాధీనం
జన్జున్ వాలా తన జూనియర్ల కంప్యూటర్లోకి లాగ్ ఇన్ అవ్వడం.. కంపెనీ సొమ్మును వ్యక్తిగత ఖాతాలోకి బదిలీ చేసుకోవడం వంటి దృష్యాలు నమోదైన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దృశ్యాల ఆధారంగా జున్జున్ వాలా రెండు విడతల్లో 5.4 మిలియన్ డాలర్ల కంపెనీ సొమ్ములు తనకు అనుకూలమైన ఖాతాలోకి బదిలీ చేసుకున్నట్లు గుర్తించారు. సెప్టెంబర్ 4న జరిగిన ఈ ఘటనపై ఆ ముగ్గురు తోటి ఉద్యోగులకు తెలియదా? వారూ ఈ మోసంలో పాలు పంచుకున్నారా అనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.