కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన లక్ష్యానికి చేరువైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. పేదలకు 8 కోట్ల నూతన ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో 2016 మే 1న ఈ పథకాన్ని ప్రారంభించింది మోదీ సర్కార్. ఇందుకు 2020 మార్చిని గడువుగా పెట్టుకుంది.
లక్ష్యానికి మరో 7 నెలలు ఉండగానే.. 8 కోట్ల ఎల్పీజీ గ్యాన్ కనెక్షన్లు పూర్తవ్వనున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. మహారాష్ట్ర ఔరంగాబాద్‌లోని సెంద్రలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా.. 8 కోట్ల లక్ష్యంలో చివరి సిలిండర్‌ను నేడు లబ్ధిదారుకు అందజేయనున్నట్లు వెల్లడించాయి.
ఈ పథకం ద్వారా ముందు 2019 మార్చి నాటికి 5 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది కేంద్రం. ఆ తర్వాత లక్ష్యాన్ని 8కోట్లకు, గడువును 2020 మార్చి వరకు పొడిగించింది.
పథకం ఎందుకంటే?
వంట చేసేందుకు కట్టెలపొయ్యి, బొగ్గుల పొయ్యిల వాడకాన్ని తగ్గించి.. వాటి స్థానంలో సిలిండర్ వినియోగాన్ని పెంచడమే ఈ పథకం ఉద్దేశం. కట్టెలు, బొగ్గ వినియోగంతో వంట చేసే మహిళలకు, పిల్లలకు శ్వాసకోస సంబంధిత వ్యాదులు వస్తున్న కారణంగా.. వాటిని అరికట్టేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చింది కేంద్రం.
ఉజ్వల పథకంతో ఇలా మేలు
కేంద్ర ప్రభుత్వం ఒక్కో గ్యాస్ కనెక్షన్‌కు రూ.1600 ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఇందులో 14.2కిలోల సిలిండర్, డిపాజిట్, రెగ్యులేటర్, సురక్ష పైపు, పాస్‌పుస్తకం, నిర్వహణ ఛార్జీలు తదితర వాటికి చెల్లిస్తుంది. స్టవ్, మొదటి సిలిండర్ కొనుగోలుకు వడ్డీలేని రుణాన్ని వివిధ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు లబ్ధిదారులకు ఇస్తాయి.
ఇదీ చూడండి: ఆఫీసు వేళల్లో ఆన్లైన్ వీడియోలు చూస్తున్నారు!