రేపు ప్రవేశపెట్టనున్న 2019-20 పూర్తి కాల బడ్జెట్ ముందు.. 2018-19 ఆర్థిక సర్వేను లోక్ సభలో ప్రవేశపెట్టింది కేంద్రం. దేశ ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది? ఆర్థిక వృద్ధికి ఎలాంటి సవాళ్లు ఎదరవుతున్నాయి? అనే విషయాలను ప్రతిబింబించేలా ప్రవేశపెట్టిన ఈ సర్వేలో పలు కీలక విషయాలు ఇవే..
- 2018-19తో పోల్చుకుంటే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ స్వల్పంగా పెరిగి 7 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది.
- పెట్టుబడుల్లో వృద్ధి, వినియోగం పెరగటం వంటి కారణాల వల్ల ఆర్థిక వృద్ధికి ఊతమందనుంది.
- భారత్ 2024-25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా వృద్ధి చెందాలంటే.. 8 శాతం వృద్ధి లక్ష్యం అవసరం.
- స్వదేశీ, విదేశీ పెట్టుబడుల వృద్ధితో ఉద్యోగకల్పన పెరిగే అవకాశం ఉంది.
- 2018-19 ఆర్థిక సంవత్సరంలో దిగుమతులు 15.4 శాతం, ఎగుమతులు 12.5 శాతం పెరిగాయి.
- గత ఆర్థిక సంవత్సరం 283.4 మిలియన్ టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి జరింగింది.
- 2019 జూన్ నాటికి భారత్ వద్ద 422.2 బిలియన్ డాలర్ల విదేశీ మారకపు నిల్వలు ఉన్నాయి.
- ప్రస్తుతం ఉన్న సంప్రదాయ వాహనాల స్థానంలో విద్యుత్ వాహనాలు తెచ్చేందుకు ప్రభుత్వ పాలసీల్లో మార్పులు అవసరం.
- జనాభా అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య రంగాల్లో పెట్టుబడులు అవసరమని సర్వే సూచించింది.
- సహజ వనరుల వినియోగంపై జాతీయ విధానాలు అవసరమని సర్వే సూచించింది.