ఒక రోజు పాటు నిలిచిపోయిన సేవలను ఫ్లిప్‌కార్ట్ పునరుద్ధరించింది. కిరాణా సామగ్రి, అత్యవసరాల డెలివరీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. స్థానిక అధికారుల నుంచి భద్రతకు సంబంధించిన అనుమతులు పొందాక సేవలను మళ్లీ ప్రారంభించింది.
"డెలివరీ అధికారులు, సరఫరా వ్యవస్థకు సంబంధించి పూర్తి భద్రతకు స్థానిక అధికారుల నుంచి హామీ పొందాం. ఫలితంగా ఈ రోజు నుంచి కిరాణా, అత్యవసర వస్తువుల సేవలను అందుబాటులోకి తెస్తున్నాం. వినియోగదారులతో పాటు సంస్థ ఉద్యోగులు సురక్షితంగా ఉండేలా తగిన ఏర్పాట్లు చేస్తాం."
- కల్యాణ్ కృష్ణమూర్తి, ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓ
అమెజాన్ కూడా అత్యవసర సేవలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది.
"స్థానికంగా నెలకొన్న ఆంక్షల నేపథ్యంలో ప్రస్తుతానికి డెలివరీ చేయలేకపోతున్నాం. సేవలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వ అధికారులతో కలిసి పని చేస్తున్నాం. త్వరలోనే ఈ విషయంలో పురోగతిపై సమాచారం అందిస్తాం."
- అమెజాన్ ప్రకటన
హెచ్‌డీ ప్రసారాల నిలిపివేత..
దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు ప్రకటించిన లాక్‌డౌన్ సమయంలో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో మొబైల్‌లో హైడెఫినెషన్ (హెచ్‌డీ), అల్ట్రా హై డెఫినెషన్ కంటెంట్‌ల ప్రసారాలను రద్దు చేస్తున్నట్లు వీడియో స్ట్రీమింగ్ యాప్‌లు ప్రకటించాయి.
హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, టిక్‌టాక్, సోనీ, గూగుల్, ఫేస్‌బుక్, ఎంఎక్స్ ప్లేయర్, జీ, నెట్‌ఫ్లిక్స్‌లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ఏప్రిల్ 14 వరకు సెల్యులార్ నెట్‌వర్క్‌పై అధిక భారం పడకూడదనే ఉద్దేశంతో కేవలం స్టాండర్డ్ డెఫినేషన్ కంటెంట్‌ను మాత్రమే ఇవి ప్రసారం చేయనున్నాయి.