ఫేస్‌బుక్‌ను తమ ప్లాట్‌ఫామ్‌లలో వినియోగించే పదుల వేల యాప్‌లను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది దిగ్గజ సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్బుక్. లక్షల మంది ఫేస్బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చిన తర్వాత గతేడాది నుంచి సమాచార గోప్యతపై సమీక్షలు నిర్వహిస్తోంది. ఈ చర్యల్లో భాగంగానే భద్రతా ప్రమాణాలపై అనుమానాలున్న కారణంగా ఫేస్‌బుక్‌ను వాడకుండా కొన్ని వేల యాప్‌లను నిలిపివేస్తున్నట్లు శుక్రవారం తెలిపింది జుకర్‌బర్గ్ సంస్థ. ఈ యాప్‌ల వల్ల వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి ఎలాంటి ముప్పు లేదని.. తాము అడిగిన సమాచారాన్ని పొందుపరచని కారణంగానే వాటిపై చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది ఫేస్బుక్.
డేటా దుర్వినియోగంపై దుమారం
2016లో డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా రాజకీయ ప్రచారం నిర్వహించిన కేంబ్రిడ్జ్ అనలిటికా... 10 లక్షలమంది ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసిందని వచ్చిన ఆరోపణలు పెను దుమారం రేపాయి. ఈ విషయం వెల్లడైన తరువాత.. 2011 నాటి ఫేస్బుక్ గోప్యతా ఉల్లంఘనలపై విచారణను గతేడాది తిరిగి ప్రారంభించింది అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్. చివరకు పేస్‌బుక్‌కు 5 బిలియన్ డాలర్ల జరిమానా విధించింది.
అనంతరం సమాచార గోప్యతపై సమీక్షలు నిర్వహిస్తోంది ఫేస్బుక్. ఏడాది క్రితం 400 యాప్‌లను సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఆ చర్యలను మరింత కఠినతరం చేసింది. వేల యాప్‌లను నిషేధించింది. వీటిపై విచారణ చేపడుతున్నామని తెలిపింది. భద్రతా ప్రమాణాలకు ముప్పు లేదని భావించిన యాప్‌లపై సస్పెన్షన్ ఎత్తివేస్తామని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: ప్రభుత్వ ఉద్దీపనలతో.. సామాన్యులకూ లాభాలే!