టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ సంపద రాకెట్ వేగంతో పెరుగుతోంది. తన రాకెట్ కంపెనీ స్పేస్ఎక్స్ ద్వారా అంతరిక్షంలోకి నలుగురు వ్యోమగాములను పంపడం, ఎస్&పీ 500 స్టాక్స్ జాబితాలో టెస్లా భాగం కావటం.. మస్క్ జెట్ స్పీడ్‌తో ముందుకెళుతున్నారు.
ఎస్&పీ 500 జాబితాలో టెస్లా చోటుదక్కించుకోవటం వల్ల ఆయన సంపద ఒక్కసారిగా 15 బిలియన్ డాలర్లు పెరిగింది. అమెరికా స్టాక్ మార్కెట్లో సోమవారం టెస్లా షేరు విలువ 14 శాతం పెరిగి 408.09 డాలర్ల వద్ద ముగిసింది. ఫలితంగా మస్క్ మొత్తం ఆస్తి విలువ 117.5 బిలియన్ డాలర్లకు చేరింది.
రికార్డు లాభాలు..
ఈ ఏడాదిలో మస్క్ సంపద మొత్తం 90 బిలియన్ డాలర్లు పెరిగింది. ప్రపంచంలో 500మంది కుబేరుల్లో ఈస్థాయిలో ఆర్జించి రికార్డు సాధించారు మస్క్. ప్రపంచ అత్యంత ధనవంతుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న మస్క్.. త్వరలోనే ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌ను అధిగమించే అవకాశం ఉందని బ్లూమ్‌బర్గ్ నివేదించింది.
ఎలాన్‌కు కరోనా..
తాను కరోనా బారిన పడినట్లు మస్క్ శనివారం ప్రకటించారు. స్వల్ప లక్షణాలు ఉన్నట్లు తెలిపారు. అనంతరం తనకు ఎలాంటి లక్షణాలు లేవని ఆదివారం వెల్లడించారు. అదే రోజు స్పేస్ఎక్స్ వ్యౌమనౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నలుగురు వ్యోమగాములను పంపారు.
ఇదీ చూడండి: 100బిలియన్ డాలర్లు దాటిన మస్క్ సంపద