ప్రముఖ పారిశ్రామికవేత్త, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సంపద మరో రికార్డు స్థాయికి చేరింది. బుధవారం టెస్లా షేర్లు(అమెరికా మార్కెట్లో) భారీగా పుంజుకోవడం వల్ల ఎలాన్ మస్క్ సంపద తొలిసారి 101 బిలియన్ డాలర్లుకు చేరింది. ప్రపంచంలోనే 100 బిలియన్ డాలర్ల సంపద కలిగిన నాలుగో వ్యక్తిగా ఎలాన్ మస్క్ నిలిచారు. ఈ ఏడాది ఇప్పటి వరకు మస్క్ సంపద 73.6 బిలియన్ డాలర్లు పెరిగింది.
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ షేర్లు కూడా బుధవారం భారీగా లాభాపడ్డాయి. దీనితో సంస్థ సీఈఓ జెఫ్ బెజోస్ సంపపద ఏకంగా 200 బిలియన్ డాలర్లకు చేరింది. బెజోస్ మాజీ భార్య మెకాంజీ సంపద కూడా భారీగా పెరిగింది. 2020 జనవరి నుంచి బెజోస్ సంపద 87.1 బిలియన్ డాలర్లు పెరిగింది.
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ప్రపంచమంతా సంక్షోభంలో ఉన్నా..
ప్రపంచవ్యాప్తంగా టాప్ 500 ధనవంతుల సంపద ఈ ఏడాది 809 బిలియన్ డాలర్లు పెరిగినట్లు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. కరోనా కారణంగా ప్రపంచమంతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. ఇలాంటి సమయంలోనూ వీరి సంపద ఈ స్థాయిలో పెరగటం గమనార్హం.
100 బిలియన్ డాలర్ల 'మార్క్' సంపద
అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ తర్వాత.. ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ సంపద ఈ నెల ఆరంభంలో తొలిసారి 100 బిలియన్ డాలర్లు మార్క్‌ను దాటింది. కొద్ది రోజుల్లోనే..ఎలాన్ మస్క్ అ స్థాయికి చేరారు.
గత నెల గణాంకాల ప్రకారం ప్రపంచ కుబేరుల జాబితాలో తొలి ఐదు స్థానాల్లో చోటు దక్కించుకున్న ఏకైక ఏషియన్‌గా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నిలిచారు.
ఇదీ చూడండి:'మొండి బాకీల పరిష్కారానికి 'బ్యాడ్ బ్యాంక్' తప్పనిసరి'