వదంతులు వ్యాప్తి చెందితే ఎంతటి షేరైనా స్టాక్ మార్కెట్‌లో తట్టుకొని నిలబడటం చాలా కష్టం. ఎస్ బ్యాంక్ సంక్షోభం ఉదంతం కళ్ల ముందు కనిపిస్తున్న నేపథ్యంలో ఎలాంటి ప్రతికూల వార్త వచ్చినా మార్కెట్ చాలా వేగంగా స్పందిస్తోందనడానికి ఇండస్‌ఇండ్ బ్యాంక్ తాజా పరిస్థితి ఓ ఉదాహరణ. బుధవారం నాడు ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు ఏకంగా 23.73 శాతం కోల్పోయి రూ.460.80 వద్ద ముగిసింది. గత 2 నెలల్లో ఏకంగా 69 శాతం క్షీణించడం అంటే మామూలు విషయం కాదు. రూ.లక్ష పెట్టుబడి పెట్టిన మదుపరికి ఇప్పుడు మిగిలింది రూ.31 వేలే కావడం గమనార్హం.
ఎందుకిలా?
ఇండస్‌ఇండ్ బ్యాంకు ఆస్తుల నాణ్యత విషయంలో మార్కెట్‌లో వదంతులు వ్యాపిస్తున్నాయి. వ్యక్తిగత రుణాలు అధిక మొత్తంలో జారీ చేసిందని, ఇవి మొండి బాకీలుగా మారే అవకాశం ఉందని, అదే గనుక జరిగితే బ్యాంకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికి తోడు ఇటీవల కొన్ని ప్రభుత్వ సంస్థలు ఈ బ్యాంక్‌లో తమ డిపాజిట్లను ఉపసంహరించుకోవడం కూడా ఒకింత ఊహాగానాలకు ఆజ్యం పోసినట్లయింది. దీంతో మదుపర్లు విక్రయాలకు దిగారు.
మూలాలు బలంగా ఉన్నాయి
మార్కెట్‌లో వస్తున్న ఊహాగానాలపై ఇండస్‌ఇండ్ బ్యాంక్ స్పందించింది. 'మా బ్యాంకు ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయి. మూలధనం సరిపడినంత ఉంది. నిధుల లభ్యత కూడా 120% ఉంది. చెప్పుకోదగ్గ స్థాయిలో బ్యాంకు లాభాలు ఆర్జిస్తోంది. ప్రైవేటు రంగ బ్యాంకుల్లో 2019 డిసెంబరు త్రైమాసికం ముగిసే నాటికి అతి తక్కువ స్థూల నిరర్థక ఆస్తులు (2.18%) కలిగిన బ్యాంకుల్లో మాది కూడా ఒకటి. 2020 మార్చి త్రైమాసికంలోనూ మా నికర ఎన్‌పీఏలు 1.05% నమోదు కావొచ్చని భావిస్తున్నాం. అంతర్గతంగా మా బ్యాంకులో బలమైన పాలనా వ్యవస్థ ఉంద'ని వెల్లడించింది.
భయాలు అక్కర్లేదంటున్న ఆర్‌బీఐ
ఎస్ బ్యాంక్ సంక్షోభంతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పెద్ద మొత్తంలో డిపాజిట్లు చేసిన వారు సైతం ఇతర ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచి తమ డిపాజిట్లను వెనక్కి తీసుకుంటున్నారు. ఎస్ బ్యాంక్‌తో పాటు గత సెప్టెంబరులో పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార (పీఎంసీ) బ్యాంకులో తలెత్తిన సంక్షోభం కూడా డిపాజిటర్లకు బ్యాంకులపై నమ్మకం కోల్పోయేలా చేస్తోంది. పీఎంసీలో ఒకే ఒక ఖాతాదారుకు (హెచ్‌డీఐఎల్) భారీగా రుణాలు ఇవ్వడం వల్ల ఆ బ్యాంకు ఆస్తులు 73 శాతం మేర దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకుల్లోని డిపాజిటర్ల సొమ్ముకు హామీ ఇస్తున్నప్పటికీ ప్రస్తుతం ప్రైవేటు బ్యాంకుల నుంచి ఉపసంహరణలు పెరగడం గమనార్హం. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోకి తమ డిపాజిట్లను మారుస్తుండటంపై ప్రజలతో పాటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్‌బీఐ స్పష్టతనిచ్చింది. ప్రైవేటు బ్యాంకుల ఆర్థిక పరిస్థితి బాగా ఉందని మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు కూడా రాసింది. ఇంత చేస్తున్నా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, లక్ష్మి విలాస్ బ్యాంక్ వంటి బ్యాంకుల షేర్లను మార్కెట్‌లో భారీగా విక్రయిస్తుండటం వల్ల వాటి విలువ తగ్గుతోంది. ఎస్ బ్యాంక్‌లో ఏదో జరుగుతోందని గమనించిన చాలా మంది డిపాజిటర్లు మార్చి 5 తేదీలోపు సుమారు రూ.72,000 కోట్ల డిపాజిట్లు ఉపసంహరించుకున్నారు. ఏ బ్యాంకులో దాచుకున్న డిపాజిట్లకైనా ఎలాంటి ప్రమాదం లేదని ది ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సునీల్ మెహతా వెల్లడించారు.
ఇదీ చూడండి:టిక్..టిక్.. టిక్.. మాంద్యంలోకి జారుకుంటున్నామా?