ప్రముఖ కాఫీ ఫ్రాంచైజీ సంస్థ కేఫ్ కాఫీ డే (సీసీడీ) ఇంకా సంక్షోభం నుంచి కోలుకున్నట్లు కనబడటం లేదు. దేశవ్యాప్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 280 ఔట్లెట్లను మూసేసింది సీసీడీ.
లాభాల్లో తగ్గుదల, భవిష్యత్లో ఖర్చులు పెరగొచ్చనే కారణాలతో ఔట్లెట్ల మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు సీసీడీ వెల్లడించింది.
ఆదాయంలో క్షీణత ఇలా..
2020-21 క్యూ1లో రోజు వారి విక్రయాల ద్వారా సగటున ఒక సీసీడీకి వచ్చే ఆదాయం రూ.15,445కు తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఒక సీసీడీ సగటు ఆదాయం రోజుకు రూ.15,739గా ఉండేది.
ఇదే సమయానికి సీసీడీ కాఫీ వెండింగ్ యంత్రాల సంఖ్య మాత్రం 49,397 నుంచి 59,115కు పెరగటం గమనార్హం.
అప్పులు తీర్చేందుకు ఆస్తుల విక్రయం..
అప్పుల భారం తట్టుకోలేక సీసీడీ వ్యవస్థాపపకుడు వి.జి.సిద్ధార్థ గత ఏడాది జులైలో బలవన్మరణానికి పాల్పడ్డారు. అ తర్వాత సంస్థ అధికారులు ఆస్తుల విక్రయం ద్వారా అప్పులు తీర్చుకుంటూ వస్తున్నారు.
ఇలా ఇప్పటి వరకు 13 రుణదాతలకు రూ.1,644 కోట్ల అప్పు తిరిగి చెల్లించినట్లు మార్చిలో సీసీడీ ప్రకటించింది. ఇందుకోసం ప్రముఖ ఐటీ సంస్థ మైండ్ ట్రీలో సీసీడీకి ఉన్న వాటను ఎల్&టీకి విక్రయించినట్లు తెలిపింది.
సంస్థపై మరింత ఆర్థిక భారం పడకుండా ఔట్లెట్లను మూసేయడం వంటి చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.