ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులను 51 శాతానికన్నా తగ్గించుకోవాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ త్వరలో ఆమోదం తెలిపే అవకాశమున్నట్లు సమాచారం.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న కేబినెట్ సమావేశంలో.. ప్రభుత్వ రంగ జనరల్ బీమా సంస్థల విలీనం అంశమూ చర్చకు రానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
2018-19 బడ్జెట్ సమావేశాల్లోనే.. ప్రభుత్వ రంగ జనరల్ ఇన్స్యూరెన్స్ సంస్థలను విలీనం చేసి.. ఈ సంస్థను స్టాక్ మార్కెట్లో నమోదు చేయాలని ప్రతిపాదన వచ్చింది.
ప్రభుత్వ రంగ ఇన్స్యూరెన్స్ సంస్థలైన నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్, ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ కంపెనీల విలీన అంశం ముందుకు సాగే అవకాశముందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతవారం తెలిపారు.
2019-20 బడ్జెట్ ప్రసంగంలో.. ప్రభుత్వం ఆర్థికేతర రంగాల్లో పెట్టుబడులను ఉపసంహరించుకునే విధానాన్ని అనుసరిస్తున్నట్లు పేర్కొన్నారు సీతారామన్. వాటిల్లో పెట్టుబడులను 51 శాతానికి తగ్గకుండా చూసుకుంటున్నట్లు తెలిపారు.
అయితే ప్రస్తుతం ఇంకా అవసరమైతే ప్రభుత్వ సంస్థల నుంచి 51 శాతానికి కన్నా తక్కువగా ప్రభుత్వ వాటా కుదించుకునే విషయాన్ని పరిగణించే అవకాశమున్నట్లు ఆమె పేర్కొన్నారు. వాటా 51 శాతానికి తగ్గినా.. ఆయా సంస్థలు ప్రభుత్వాధీనంలోనే ఉండేలా చూసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
కంపెనీ చట్టం సెక్షన్ 241 సవరణ ద్వారా ఇది సాధ్యపడనుంది.
గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో..
2018-19 ఆర్థిక సంవత్సరంలో.. ప్రభుత్వ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా కేంద్రం రూ.84,972 కోట్లు ఆర్జించింది.
2017-18 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.1,00,056 కోట్లు గడించింది.
ఇదీ చూడండి: ప్రపంచ ఖరీదైన నివాస నగరాల్లో దిల్లీకి 9వ ర్యాంక్