భారీ నష్టాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ రంగ టెలికాం సంస్థల పరిరక్షణకు కసరత్తు ముమ్మరం చేసింది కేంద్రం. ఇందులో భాగంగా బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలను విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ బాండ్ల జారీ, ఆస్తుల మానిటైజేషన్ ద్వారా నిధులను సమకూర్చడం, ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాలను ప్రవేశపెట్టడం వంటి చర్యలు చేపట్టనుంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. రెండు ప్రభుత్వ టెలికాం సంస్థలను గట్టెక్కించేందుకు రూ.29,937 కోట్లు ప్రభుత్వం వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు. 4జీ స్పెక్ట్రమ్ వ్యవహారంలో రూ.4 కోట్ల జీఎస్టీని కేంద్రమే చెల్లిస్తుందని వెల్లడించారు. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలను మూసేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు.
ప్రభుత్వ బాండ్ల ద్వారా రూ.15,000 కోట్లు, ఆస్తుల మానిటైజేషన్ ద్వారా రూ.38,000 కోట్లను వచ్చే నాలుగేళ్లలో సమాకూర్చనున్నట్లు రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.
ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులకు ఆకర్షణీయ స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించింది కేంద్రం. విలీన ప్రక్రియ పూర్తయ్యే వరకు.. బీఎస్ఎన్ఎన్ఎల్ అనుబంధ సంస్థగా ఎంటీఎన్ఎన్ల్ పని చేస్తుందని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: గోధుమలు, పప్పు ధాన్యాల మద్దతు ధర పెంపు