లగ్జరీ స్మార్ట్‌ఫోన్ అంటే ముందుగా గుర్తొచ్చేది.. యాపిల్ ఐఫోన్. అమెరికా మినహాయించి.. చాలా వరకు ఇతర దేశాల్లో ఐఫోన్ కొనడం అంటే.. భారీ ఖర్చుతో కూడుకున్న పని. భారత్‌లోనూ ఇదే పరిస్థితి.
ధర ఎక్కువగా ఉందని ఐఫోన్ కొనలేకపోతున్న వారికి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చే దిశగా యాపిల్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ధర తగ్గించకుండా.. సులభ వాయిదాల్లో చెల్లించేందుకు వీలుగా సబ్స్క్రిప్షన్ విధానాన్ని యాపిల్ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
యాపిల్ ప్రైమ్ పేరుతో ఆఫర్?
యాపిల్ సంప్రదాయ అమ్మకాల విధానాన్ని చందాదారు విధానంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సంస్థ సీఈఓ టిమ్ కుక్ సంకేతాలు ఇచ్చారని ప్రముఖ వార్తా సంస్థ సీఎన్‌బీసీ ఇటీవల పేర్కొంది. ఇందుకు సంబంధించి యాపిల్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. యాపిల్ ప్రైమ్ పేరుతో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు అంచనా.
యాపిల్ సేవలన్నింటికీ నెలవారీ చందాలు..
ఇతర చందా విధానాల్లానే.. యాపిల్ చందా విధానం పనిచేస్తుంది. యాపిల్ ఫోన్ కోసం నెలవారీ చందాను మీరు ఎంచుకోవచ్చు. ఇతర సేవలైన యాపిల్ ఆర్కేడ్, యాపిల్ టీవీ ప్లస్, యాపిల్ మ్యూజిక్ వంటి సదుపాయాలనూ ఈ చందా విధానం ద్వారా పొందొచ్చు.
యాపిల్ కొత్త విధానంతో ఏటా ఐఫోన్‌ను మార్చుకోవడం లేదా.. కొత్త మోడల్‌కు మారడం వంటివీ చేసుకోవచ్చని తెలుస్తోంది.
ఈఎంఐకి, యాపిల్ చందాకు తేడా?
ప్రస్తుతం ఏదైనా ఫోన్ కొంటే... నెలవారీ వాయిదాల్లో(ఈఎంఐ) ఆ ఫోన్ ధర మొత్తాన్ని చెల్లించే వీలుంది. యాపిల్ నెలవారీ చందా దీనితో పోలిస్తే ఎలా ప్రత్యేకమని అనుమానం రావచ్చు.
ఈ పద్ధతిలో బ్యాంకులు పరిమిత సమయం వరకు నోకార్డ్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నాయి. పరిమితికి మించిన వాయిదాలకు వడ్డీ చెల్లించాల్సిందే. అయితే యాపిల్ చందావిధానంతో వడ్డీ లేకుండానే నెలవారీ వాయిదాల్లో ఐఫోన్ ధర మొత్తాన్ని చెల్లించవచ్చు.
మరిన్ని..
యాపిల్ ప్రస్తుతం అందిస్తున్న వివిధ సేవలకు వేరువేరుగా చందా చెల్లించాల్సి వస్తోంది. ఈ కొత్త విధానం అందుబాటులోకి వస్తే.. అన్ని రకాల సేవలకు.. ఒకే సారి నెలవారీ చందాలు చెల్లించే వీలు కలగనుంది.
ఈ విధానానికి సంబంధించిన పూర్తి వివరాలు.. ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనే అంశాలను యాపిల్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఇదీ చూడండి: 5 కెమెరాల షియోమీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది