అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వరుసగా నాలుగో ఏడాదీ ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో నిలిచారు. ఏడాది కాలంగా ప్రపంచాన్ని కరోనా పట్టి పీడిస్తున్నప్పటికీ.. కుబేరుల సంపద మరింతగా పెరగడం విశేషమని ఫోర్బ్స్ తన 2021 వార్షిక ప్రపంచ బిలియనీర్ల జాబితాలో వెల్లడించింది. రికార్డు స్థాయిలో ఈ ఏడాది 2,755 మంది బిలియనీర్లు (దాదాపు రూ.7,350 కోట్ల కంటే ఎక్కువ సంపద ఉన్నవారు) జాబితాలో చోటు దక్కించుకున్నారని సంస్థ మంగళవారం తెలిపింది. వీరి మొత్తం సంపద 13.1 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుందని.. ఇది గతేడాది నాటి 8 లక్షల కోట్ల డాలర్ల కంటే చాలా ఎక్కువని తెలిపింది.
ఇక గతేడాది 31వ స్థానంలో ఉన్న టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలాన్ మస్క్ రెండో స్థానంలో నిలిచారు. విలాసవంత వస్తువుల కంపెనీ ఎల్వీఎమ్హెచ్ అధిపతి బెర్నార్డ్ ఆర్నాల్డ్, మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్ గేట్స్, ఫేస్బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్బర్గ్లు టాప్-5లో చోటు దక్కించుకున్నారు. రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా వారెన్ బఫెట్ తొలి అయిదు స్థానాల నుంచి బయటకు వెళ్లారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి, ఆసియాలో అత్యంత ధనవంతుడు ముకేశ్ అంబానీ 84.5 బిలియన్ డాలర్లతో పదో స్థానాన్ని సాధించారు. చైనాకు చెందిన జాక్ మా సంపద 10 బిలియన్ డాలర్లు పెరిగి 48.4 బి. డాలర్లకు చేరినా.. 26వ స్థానానికే పరిమితం అయ్యారు. మార్చి 5 నాటి షేర్ల ధరలు, ఎక్స్ఛేంజీ రేట్ల ఆధారంగా బిలియనీర్ల సంపదను లెక్కగట్టినట్లు ఫోర్బ్స్ తెలిపింది. ఈ ఏడాది కొత్తగా 493 మంది జాబితాలో చేరారు.
తెలుగు రాష్ట్రాల నుంచి
ఇదీ చూడండి: బంగారం స్వచ్ఛతను తెలుసుకునేందుకు ఐదు మార్గాలు