టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్' కొత్త నిబంధనలతో కేబుల్ టీవీ, డీటీహెచ్‌ల వ్యాపారాల్లో భారీ మార్పులు వచ్చాయి. డీటీహెచ్ ఆపరేటర్ల మధ్య పోటీ కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆర్థికపరమైన ఒత్తిడి, పోటీని తట్టుకునేందుకు విలీనాలపై దృష్టి సారిస్తున్నాయి పలు సంస్థలు.
వీడియోకాన్‌కు చెందిన డీ2హెచ్, డిష్ టీవీతో కలిసిపోయి.. విలీనాలకు బీజం వేసింది. ఇప్పుడు అదే బాటలో ఎయిర్టెల్ డిజిటల్ టీవీ, డిష్ టీవీలు కలిసి పని చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
అప్పట్లో అలా.. ఇప్పుడు ఇలా
ఎయిర్టెల్ డిజిటల్ టీవీ, డిష్ టీవీ కలిసిపోనున్నాయని.. తొలుత వార్తలొచ్చినప్పుడు.. ఆ రెండు కంపెనీలు వాటిని వదంతులుగా కొట్టిపారేశాయి. విలీనం వల్ల ఒరిగేదేమి లేదని అన్నాయి. కానీ ఇప్పుడు ఆ రెండు కంపెనీలు కలిసిపోనున్నట్లు అధికారికంగా వెల్లడైంది.
అతిపెద్ద మార్కెట్ వాటాదారుగా అవతరించడం సహా.. డిష్ టీవీకి ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఇబ్బందులే ఈ కలయికకు ప్రధాన కారణమని ఆయా కంపెనీలు అంటున్నాయి.
మళ్లీ అదే ఫార్ములా...
గిగాటీవీ, ఇంటర్నెట్ ఆధారంగా పని చేసే ఐపీ టీవీలను మరి కొన్ని వారాల్లో ఆవిష్కరించనుంది రిలయన్స్ జియో. జియో భారీ ఆఫర్లు ప్రకటించే అవకాశం ఉంది. వాటిని తట్టుకుని మార్కెట్లో నిలబడాలంటే కలిసి పని చేయడమే సరైందని ఆ కంపెనీలు భావిస్తున్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇందుకోసం జియో మార్కెట్లోకి ప్రవేశించకముందే ఈ రెండు కంపెనీలు కలిసిపోయేందుకు మొగ్గుచూపుతున్నాయని చెబుతున్నాయి.
రెండు కంపెనీలు కలిస్తే ఏమవుతుంది?
ఎయిర్టెల్ డిజిటల్ టీవీ, డిష్ టీవీ కలిస్తే.. డీటీహెచ్ రంగంలో 61 శాతం మార్కెట్ వాటా కొత్తగా ఏర్పడే కంపెనీ చేతిలో ఉంటుంది. జియో రాకతో టెలికాం రంగంలో పోటీని తట్టుకునేందుకు వొడాఫోన్, ఐడియా పాటించిన వ్యూహాన్నే.. ఇప్పుడు ఎయిర్టెల్, డిష్ టీవీ అనుకరిస్తున్నాయి. దీని ద్వారా ప్రధాన మార్కెట్ వాటా వీటి చేతుల్లో ఉంటుంది కాబట్టి.. జియోకు ప్రారంభంలోనే గట్టిపోటీ ఇవ్వచ్చని అనుకుంటున్నట్లు మార్కెట్ వర్గాల విశ్లేషణ.
2018 డిసెంబర్ నాటికి డిష్‌టీవీకి 23.6 మిలియన్ల చందాదార్లు ఉన్నారు. సంస్థ ఆదాయం రూ.1,517.4 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో ఎయిర్టెల్ డిజిటల్ టీవీకి 15 మిలియన్ల మంది చందాదార్లు ఉండగా.. సంస్థ ఆదాయం రూ.1,033 కోట్లుగా ఉంది.
ఇదీ చూడండి: చిరు వ్యాపారులూ... మీ బడ్జెట్ ఇలా ఉందా?