భారీ రుణ భారంతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు చెందిన పైలట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరికి ఘాటు లేఖ రాశారు.
తమకు సత్వరమే బకాయిలు చెల్లించాలని, ఎలాంటి నోటీసు పీరియడ్ లేకుండా ఉద్యోగాల నుంచి వైదొలిగే సదుపాయం కల్పించాలని కోరారు. ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తున్న నేపథ్యంలో ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ (ఐసీపీఏ) ఈ మేరకు లేఖ రాసింది. ఇందులో సుమారు 800 మంది ఎయిర్ఇండియా పైలట్లు సభ్యులుగా ఉన్నారు.
సంస్థ మూతపడడమే శరణ్యం
2020 మార్చి నాటికి ప్రైవేటీకరించకుంటే ఎయిర్ ఇండియా మూతపడడమే శరణ్యమని లేఖలో ఆ సంఘం హెచ్చరించింది. ఎయిర్ ఇండియా నుంచి వైదొలిగేందుకు తమకు ఎలాంటి నోటీసు పీరియడ్ నిబంధన విధించొద్దని, తామేమీ బాండెడ్ లేబర్ కాదని పేర్కొంది. తమకు బకాయిలను సత్వరమే చెల్లించాలని డిమాండ్ చేసింది.
తమకు రానురాను ఓపిక నశిస్తోందని, పనిచేసేందుకు తాము సిద్ధంగా లేమని పేర్కొంది. గత రెండు మూడేళ్లుగా ఒత్తిడిలో బతుకుతున్నామని, దీని కారణంగా చాలా మంది ఉద్యోగులు లోన్లు కట్టలేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేసింది.
ఇదీ చూడండి:జీవితానికి అన్వయించుకోవలసిన నాలుగు లక్షణాలు