విమాన ప్రయాణికులపై ఈ వేసవిలో మరింత భారం పడే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
అంతర్జాతీయ చమురు ధరల్లో పెరుగుదల కారణంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) ధరలను 1 శాతం(రూ.677) పెంచుతున్నట్లు సోమవారం దేశీయ చమురు సంస్థలు ప్రకటించాయి. అంతకుముందు ఫిబ్రవరిలోనూ ఇదేవిధంగా 8 శాతం మేర ధరలు పెంచాయి చమురు సంస్థలు.ప్రస్తుతం కిలోలీటర్ ఏటీఎఫ్ ధర దిల్లీలో రూ.62,785కి చేరింది.
ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విమాన సంస్థలపై ఇంధన ధర పెంపు మరింత భారం కానుంది. అందుకే టికెట్ ధరలు పెంచేందుకు మొగ్గుచూపొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
"అత్యధికంగా విమాన ప్రయాణాలు జరిగే వేసవిలో ఇంధన ధరలు పెరగటం వల్ల టికెట్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే చివరి నిమిషంలో జరిగే కొనుగోళ్లపైనే ఈ ప్రభావం ఉండొచ్చు. చాలా విమానాలు నేలకే పరిమితం అవ్వడం కూడా పెరుగుదలకు కారణమే. వాటినీ నడిపితే దేశీయ విమాన టికెట్ల ధరలు సాధారణంగా ఉండొచ్చు. అలా జరిగితే 15-20 శాతం తగ్గొచ్చు కూడా"
-అలోక్ బాజ్పాయ్, ఇక్సిగో సీఈఓ, సహ స్థాపకుడు