ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను జీవీకే గ్రూప్ నుంచి బదిలీ చేసుకున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. ఈ ఎయిర్‌పోర్టులో జీవీకే గ్రూప్‌కు ఉన్న 50.5శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు గతేడాది ఆగస్టులోనే అదానీ వెల్లడించింది. దీంతో పాటు మైనారిటీ భాగస్వాముల నుంచి 23.5 శాతం వాటాను దక్కించుకోనున్నట్లు తెలిపింది. మంగళవారం నిర్వహించిన బోర్డు మీటింగ్‌లో నిర్వహణ బాధ్యతలను స్వీకరించినట్లు అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ వెల్లడించింది. అంతకుముందు, సంస్థ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఈ విషయంపై ట్వీట్ చేశారు.
"ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను తీసుకోవడం సంతోషకరం. భవిష్యత్ ఎయిర్పోర్ట్ ఎకోసిస్టమ్‌ను రూపొందించేందుకు అదానీ గ్రూప్ ప్రయత్నిస్తుంది. స్థానికంగా వేలాది కొత్త ఉద్యోగాలను సృష్టిస్తాం. ముంబయి గర్వించేలా చేస్తామని హామీ ఇస్తున్నా."
-గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్
ముంబయి ఎయిర్పోర్ట్ పూర్తిగా అదానీ చేతికి వచ్చేందుకు కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర సిటీ, ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(సిడ్కో) నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది.
అదానీ హవా
దిల్లీ తర్వాత అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయం ముంబయిదే. ప్యాసింజర్లతో పాటు కార్గో ట్రాఫిక్ ఇక్కడ అధికంగా ఉంటుంది. కాగా, మొత్తం ఎనిమిది ఎయిర్‌పోర్టులను తన అధీనం(నిర్వహణ, అభివృద్ధి కోసం)లో ఉంచుకొని దేశంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీగా కొనసాగుతోంది అదానీ గ్రూప్. మొత్తం 25 శాతం రవాణా ఈ ఎయిర్‌పోర్టుల గుండా జరుగుతోంది. ముంబయి విమానాశ్రయంతో కలిపితే.. 33 శాతం కార్గో ట్రాఫిక్ అదానీ గ్రూప్‌లోని ఎయిర్‌పోర్టుల ద్వారానే జరుగుతుంది.
ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ఓయో సీఈఓ- కారణం?