ETV Bharat / business

ఎస్ బ్యాంక్ సంక్షోభం- ఇంటిదొంగల చేతివాటం

ఎస్ బ్యాంక్ సంక్షోభం బ్యాంకింగ్ వ్యవస్థపై సామాన్యుడిలో మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది. వ్యవస్థాపకుడు రాణా కపూర్​కు సంబంధించిన 46 సంస్థల్లోకి బ్యాంకు నుంచి రూ.4,300కోట్ల మేర అక్రమ నిధుల ప్రవాహమన్న ఆరోపణల ఆధారంగా ఖాతాలను పరిశీలించిన ఆర్​బీఐ ఏడాదిపాటు మారటోరియం విధించింది. ఈ నేపథ్యంలో తిరిగి చెల్లించే సామర్థ్యం లేదని తెలిసీ వివిధ ఒత్తిళ్లు, ప్రలోభాలకు లోబడి ఆర్థిక నేరగాళ్లకు రూ. కోట్ల మేర దోచిపెట్టిన ఉదంతాలు భారత బ్యాంకింగ్ వ్యవస్థలో అనేకం ఉన్నాయి. ప్రజాధనం, పౌరుల విశ్వాసాలే మూలధన పెట్టుబడులుగా నిలవాల్సిన బ్యాంకుల్లో నిర్ణీత కాలావధిలో నిష్పాక్షిక ఆడిటింగ్‌, తక్షణ చర్యల కోసం స్వతంత్ర వ్యవస్థను ఒకదాన్ని కొలువుతీర్చాలి. దాన్ని నేరుగా పార్లమెంటుకు జవాబుదారీ చేస్తేనే, ఇంటిదొంగల బారి నుంచి తెరిపినపడి బ్యాంకులు నిలదొక్కుకుంటాయి!

yes bank
ఎస్ బ్యాంక్ సంక్షోభం- ఇంటిదొంగల చేతివాటం
author img

By

Published : Mar 11, 2020, 8:48 AM IST

కొన్ని నెలలుగా ప్రచారంలో ఉన్న కథనాలను, తరచూ వెలుగుచూస్తున్న విశ్లేషణలను- ఎస్‌ బ్యాంక్‌ సంక్షోభం అక్షరాలా నిజం చేసింది. దేశీయంగా ప్రైవేటు రంగాన నాలుగో అతిపెద్దదిగా ఎదిగిన ఎస్‌ బ్యాంక్‌ ఇప్పుడు, పారుబాకీల తాకిడికి ఆశలరెక్కలు విరిగిన విహంగాన్ని తలపిస్తోంది! సుమారు రెండేళ్లుగా బ్యాంకుల పట్ల ప్రజల్లో విశ్వసనీయతకు వరసగా తూట్లు పడుతూనే ఉన్నాయి. 2018 ఫిబ్రవరిలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ.14వేలకోట్ల మేర బురిడీ కొట్టించిన నేరగాళ్ల బాగోతం బట్టబయలైంది. ఆపై ఐఎల్‌ఎఫ్‌ఎస్‌(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌), దేవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్ల డొల్లదనాన్ని వెన్నంటి అయిదు నెలల కిందట పీఎమ్‌సీ (పంజాబ్‌ మహారాష్ట్ర సహకార బ్యాంక్‌) కుంభకోణం ప్రజానీకాన్ని బెంబేలెత్తించింది. ఎస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ అదుపాజ్ఞల్లోని 46 సంస్థల్లోకి రూ.4,300కోట్ల మేర అక్రమ నిధుల ప్రవాహం ఆరోపణలపై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌) ఉచ్చు బిగుస్తుండటం, తాజా ప్రహసనానికి కేంద్రబిందువు.

వేలకోట్ల నిరర్ధక ఆస్తులు

వాస్తవానికి ఆ బ్యాంకులో పరిస్థితి ఏమంత సవ్యంగా లేదన్న సంగతి గ్రహించో ఏమో- నిరుడు మార్చి, సెప్టెంబరు నెలలమధ్య ఎకాయెకి రూ.18 వేలకోట్లకుపైగా డిపాజిట్లకు రెక్కలొచ్చి ఎగిరిపోయాయి. 2017 ఆర్థిక సంవత్సరంలో తమ నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) రూ.2,000 కోట్లుగా ఎస్‌ బ్యాంక్‌ ప్రకటించినా, వాస్తవంలో అవి దాదాపు రూ.8,000 కోట్లుగా ఆర్‌బీఐ లెక్కకట్టింది. 2019 ఆర్థిక సంవత్సరంలోనూ బ్యాంకు చూపిన రూ.7,883 కోట్ల ఎన్‌పీఏలు నిజానికి రూ.11,160 కోట్లుగా రిజర్వ్‌బ్యాంక్‌ నిర్ధారణకొచ్చింది. ప్రమాదకర సంకేతాల్ని పసిగట్టగానే రంగంలోకి దూకాల్సిన ఆర్‌బీఐ, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా- ఎస్‌బీఐ ద్రవ్య వసతి రూపేణా దిద్దుబాటు చర్యలకు తీరిగ్గా సిద్ధపడటంపై సహజంగానే విమర్శల వర్షం కురుస్తోంది!

ఆడిటింగ్ లోపం

తిరిగి చెల్లించే సామర్థ్యం ఏ కోశానా లేదని తెలిసీ వివిధ ఒత్తిళ్లు, ప్రలోభాలకు లోబడి ఆర్థిక నేరగాళ్లకు కోట్లు దోచిపెట్టి కన్నతల్లి లాంటి సంస్థకు ద్రోహంచేసిన సిగ్గుమాలిన ఉదంతాలు దేశీయ బ్యాంకింగ్‌ చరిత్రలో అనేకం. రాణా కపూర్‌ మానసపుత్రికగా, పదహారేళ్ల క్రితం ఆవిర్భవించేటప్పటికి- ఎస్‌ బ్యాంక్‌ నవోత్తేజానికి నిలువుటద్దం. అదీ, కడకు ద్రోహానికి బలవుతుందని ఎవరూ ఊహించి ఉండరు! తమ బ్యాంక్‌ షేర్లు వజ్రాల్లాంటివని, ఎన్నడూ వాటిని వదులుకోబోనని గతంలో ఘంటాపథంగా చాటిన కపూర్‌, ఏడాది క్రితం తప్పనిసరై పగ్గాలు విడిచిపెట్టాల్సి వచ్చిన దరిమిలా గత నవంబరులో సుమారు రెండు కోట్ల షేర్లను విక్రయించేశాడు. ఎస్‌ బ్యాంక్‌ ఆర్‌బీఐ పర్యవేక్షణలోకి వెళ్ళాక ఏం జరిగిందో ఏమోనని సన్నాయి నొక్కులు నొక్కుతున్న కపూర్‌, అతగాడి కుటుంబ సభ్యుల నిర్వాకాల పర్యవసానంగానే- కేవలం రెండేళ్లలో బ్యాంక్‌ ఆస్తుల విలువ 41 బిలియన్‌ డాలర్ల నుంచి 28 బిలియన్‌ డాలర్లకు పడిపోయిందంటున్నారు. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, రాణా కుటుంబీకుల మధ్య 'నీకిది-నాకది' (క్విడ్‌ ప్రో కో) తరహా లావాదేవీలు చోటుచేసుకున్నాయంటూ వివిధ ప్రాంతాల్లో కేదస సోదాలకు తెరతీసింది. నిజంగా చేతులు మారిన మొత్తమెంతో ఎప్పటికైనా నిగ్గుతేలుతుందో లేదో! ఈ స్థాయిలో ఆర్థిక అవకతవకలు, అధికార దుర్వినియోగం ఎస్‌ బ్యాంకులో కుంభకోణానికి ఊపిరులూదుతుంటే 'పకడ్బందీ ఆడిటింగ్‌, నిరంతర పర్యవేక్షణ' ఏమైపోయినట్లు? దూకుడుగా చేస్తున్న రుణపందేరం ఎస్‌ బ్యాంక్‌ పుట్టిముంచేదేనని 2015లోనే యూబీఎస్‌ నివేదిక హెచ్చరించగా- అభూత కల్పనలతో గణాంకాలు వండివార్చిన దిగ్గజ సంస్థపై చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతూ అప్పట్లో 'సెబీ'లో ఫిర్యాదు నమోదైంది. నాడంతగా దబాయించిన వ్యక్తి ప్రైవేటు రంగ బ్యాంకులకే తీరని అప్రతిష్ఠ తెచ్చిపెట్టేలా చక్రం తిప్పుతుంటే- చిరకాలం రిజర్వ్‌బ్యాంక్‌ చేతులెందుకు కట్టేసుకున్నట్లు?

ఆర్​బీఐ రక్షణ అరకొరేనా..!

పదహారేళ్ల క్రితం గ్లోబల్‌ ట్రస్ట్‌ బ్యాంకును ఓబీసీ (ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌), తరవాత రెండేళ్లకు యునైటెడ్‌ వెస్ట్రన్‌ బ్యాంకును ఐడీబీఐ స్వాధీనపరచుకోవడం తెలిసిందే. మళ్ళీ ఎన్నో ఏళ్ల తరవాత ఒక ప్రైవేట్‌ రంగ బ్యాంకును గట్టెక్కించేందుకంటూ ప్రభుత్వరంగ బ్యాంకునొకదాన్ని నియోగిస్తున్న సందర్భమిదే! యెస్‌బ్యాంక్‌ బోర్డుపై వేటు వేస్తూనే నెలకు రూ.50 వేల నగదు ఉపసంహరణ పరిమితి విధించిన ఆర్‌బీఐ అదే చేత్తో ఏడాదిపాటు మారటోరియం ప్రకటించింది. త్వరలో ఈ నిర్ణయాన్ని పునస్సమీక్షిస్తామంటున్నా- ఎస్‌ బ్యాంక్‌ ఏటీ1 బాండ్ల కథను అర్ధాంతరంగా ముగించేసిన దుందుడుకు నిర్ణయం మ్యూచువల్‌ ఫండ్లకు గొడ్డలిపెట్టు కానుందన్నది నిపుణుల అంచనా. ఈ 'దిద్దుబాటు చర్యల'పైనే కాదు- ఖాతాదారుల సొమ్ముకు రక్షాకవచమంటూ డిపాజిట్‌ బీమా మొత్తాన్ని ఇటీవల లక్ష నుంచి అయిదు లక్షల రూపాయలకు పెంచడం మీదా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిర్ధారిత విలువ మేర మదుపు మొత్తాలపై బీమా అన్నది, బ్యాంకుల మొత్తం డిపాజిట్లలో దాదాపు 28 శాతానికే వర్తిస్తుందన్న గణాంకాల ప్రకారం- అది అరకొర రక్షణే.

పార్లమెంట్​కు జవాబుదారీ కావాలి!

ఇప్పటికీ బ్యాంకుల్లో ఏమైనా అవకతవకలు సంభవించాక ఆ సంగతి తెలుసుకోవడానికి సగటున 22 నెలల కాలం పడుతున్నదంటే- నిఘా, పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉన్నాయో వేరే చెప్పాలా? వెలుగులోకి రాని మోసాలెన్నో అలా మరుగునపడి ఉండిపోతుండగా, బహిర్గతమైన వంచక పర్వాల్లో సైతం విచారణ, శిక్షల ఖరారు ప్రక్రియలో అడుగడుగునా జాప్యం, వాయిదాలు- అక్రమార్కులకు కోరలు కొమ్ములు తొడుగుతున్నాయి. ప్రజాధనం, పౌరుల విశ్వాసాలే మూలధన పెట్టుబడులుగా వెలుగొందాల్సిన బ్యాంకుల్లో- నిర్ణీత కాలావధిలో నిష్పాక్షిక ఆడిటింగ్‌, తక్షణ చర్యల కోసం స్వతంత్ర వ్యవస్థనొకదాన్ని కొలువుతీర్చాలి. దాన్ని నేరుగా పార్లమెంటుకు జవాబుదారీ చేస్తేనే, ఇంటిదొంగల బారి నుంచి తెరిపినపడి బ్యాంకులు నిలదొక్కుకుంటాయి!

ఇదీ చూడండి: ఏసీలు కొంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.