ప్రైవేటు టెలికాం సంస్థ రిలయన్స్ జియో, ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటున్నాయి. 2019 మార్చి-ఏప్రిల్ మధ్య గణాంకాలను విడుదల చేసింది భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్).
దేశవ్యాప్తంగా టెలికాం వినియోగదారులు 118 కోట్ల 37 లక్షల(1181. 77 మిలియన్లు) మంది ఉన్నారని తెలిపింది. 2019 మార్చిలో 1183.51 మిలియన్లుగా ఉన్న కస్టమర్ల సంఖ్య.. ఏప్రిల్ నాటికి 0.02 శాతం పెంచుకుని 1181.77 మిలియన్లకు చేరిందని ట్రాయ్ ప్రకటించింది.
వైర్లెస్ వినియోగదారులు 5 లక్షల మేర పెరిగి.. 116 కోట్ల 23 లక్షలకు చేరినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
భారతీ ఎయిర్టెల్, టాటా, వొడాఫోన్ ఐడియా భారీ కుదుపులకు లోనైన వేళ.. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో దూకుడు పెంచింది. ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్.. జియో ప్రభావాన్ని కొంతమేర తట్టుకోగలిగింది.
జియోనే అగ్రభాగాన...
ఒక్క ఏప్రిల్‌లోనే రిలయన్స్ జియో 8 మిలియన్లు(80 లక్షలు)కు పైగా కస్లమర్లను పెంచుకున్నట్లు ప్రకటించింది ట్రాయ్. మొత్తం జియో వినియోగదారుల సంఖ్య 314.8 మిలియన్లు(31 కోట్ల 48 లక్షలు)కు చేరిందని తెలిపింది.
ఇదే సమయంలో ప్రభుత్వ సంస్థ- బీఎస్ఎన్ఎల్ 2 లక్షల 32 వేల వినియోగదారులను పెంచుకొని.. 11 కోట్ల 58 లక్షలకు పైగా కస్లమర్లతో ఉంది.
ఎయిర్టెల్ పరిస్థితి ఘోరం..
జియో రాకతో భారీ కుదుపులకు లోనైన భారతీ ఎయిర్టెల్, టాటా టెలీ సర్వీసెస్, వొడాఫోన్ ఐడియా, ఎంటీఎన్ఎల్లు అంతే మొత్తంలో వినియోగదారుల విశ్వసనీయతను కోల్పోతున్నాయి. కస్టమర్ల సంఖ్య భారీగా పడిపోతోంది.
ఎయిర్టెల్ 32.8 లక్షలు, టాటా 29.5, వొడాఫోన్ ఐడియా 15.8 లక్షలకు పైగా వినియోగదారులను కోల్పోయాయి.
ల్యాండ్‌లైన్ మరింత కిందకు...
ల్యాండ్‌లైన్ వినియోగదారుల సంఖ్య మరింత క్షీణించింది. ఏప్రిల్‌లో 2 కోట్ల 14 లక్షలకు పైగా కస్టమర్లు ల్యాండ్‌లైన్‌ను వీడారు. బీఎస్ఎన్ఎల్ నుంచే 2 లక్షలకు పైగా ఉన్నారు.