స్మార్ట్ ఫోన్ కంపెనీల మధ్య ప్రస్తుతం "మెగా పిక్సల్ వార్" నడుస్తోంది. 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే 50 శాతం స్మార్ట్ ఫోన్లకు మూడు లేదా అంతకన్నా ఎక్కువ కెమెరాలు ఉంటాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది.
2018 నాటికి ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన స్మార్ట్ ఫోన్లలో దాదాపు 6 శాతం స్మార్ట్ ఫోన్లకు మూడు, అంతకన్నా ఎక్కువ కెమెరాలు ఉన్నట్లు కౌంటర్ పాయింట్ సంస్థ తెలిపింది.
ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య 15 శాతానికి చేరుతుందని.. 2020 చివరి నాటికి 35 శాతానికి పెరగొచ్చని లెక్కగట్టింది.
2021 నాటికి ఏకంగా 50 శాతం స్మార్ట్ ఫోన్లు మూడు లేదా అంతకన్నా ఎక్కువ కెమెరాలతో అందుబాటులోకి రావచ్చని తెలిపింది.
అన్నీ త్రినేత్రాలే...
ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన స్మార్ట్ ఫోన్లలో 40కి పైగా మోడళ్లు మూడు లేదా అంతకన్నా ఎక్కువ కెమెరాలు కలిగి ఉన్నాయి.
స్మార్ట్ ఫోన్ దిగ్గజాలైన హువావే, శామ్‌సంగ్‌లు మెగాపిక్సల్ పోటీలో ముందువరుసలో ఉన్నాయి. హువావే మేట్, పీ శ్రేణి, శామ్సంగ్ గెలాక్సీ ఏ శ్రేణి, వివో వీ15 ప్రో మోడల్ ఫోన్లు ప్రధానంగా మూడు కెమెరాలతో అందుబాటులోకి వచ్చాయి.
ఈ ఏడాది చివరి నాటికి లగ్జరీ స్మార్ట్ ఫోన్ కంపెనీ యాపిల్ సహా వన్ ప్లస్ సంస్థలు మూడు కెమెరాల స్మార్ట్ ఫోన్లు ఆవిష్కరించనున్నాయి. ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో 64 మెగా పిక్సల్ కమెరాతో స్మార్ట్ పోన్లు అందుబాటులోకి తీసుకురానున్నాయి.
"2020 నాటికి స్మార్ట్ ఫోన్ కెమెరా 100 మెగా పిక్సల్‌ను దాటొచ్చని అంచనా వేస్తున్నాం. గూగుల్ పిక్సల్ శ్రేణిలో ఇప్పటివరకు రెండు కెమెరాలను కూడా తీసుకురాలేదు. ఆ సంస్థ సాఫ్ట్‌వేర్‌తో నాణ్యమైన చిత్రాలను అందించేందుకే మొగ్గుచూపుతుంది. ప్రీమియం స్మార్ట్ ఫోన్ల విభాగంలో రెండు కెమెరాలను అందిపుచ్చుకుంటున్న ఇతర కంపెనీలతో గూగుల్ ఇకముందు ఆవిష్కరించే స్మార్ట్ ఫోన్లకు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది."
- హనీశ్ భాటియా, సీనియర్ అనలిస్ట్, కౌంటర్ పాయింట్ రీసెర్చ్