భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి పొందిన జైకొవ్-డి టీకా(Zycov-D Vaccine) ధరను వచ్చే వారం నిర్ణయిస్తామని జైడస్ గ్రూప్ ఎండీ శార్విల్ పటేల్ వెల్లడించారు. టీకాకు అనుమతులు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. జైకోవ్-డి టీకా కరోనా వైరస్‌పై 66 శాతం సమర్థతతో పనిచేస్తుందన్నారు.
ఈ టీకాను ఒక్కో డోసుకు 28 రోజుల వ్యవధితో మూడు డోసులుగా తీసుకోవాలి. 12ఏళ్ల పైబడిన వారికి ఈ టీకా ఇచ్చేందుకు అనుమతులు లభించాయి. వ్యాక్సిన్ ధరపై వచ్చే వారంలో స్పష్టతనిస్తామని, సెప్టెంబరు మధ్య నుంచి టీకా సరఫరా ప్రారంభిస్తామని శార్విల్ పటేల్ తెలిపారు. అక్టోబరు నుంచి నెలకు కోటి డోసులను ఉత్పత్తి చేసేందుకు నిర్ణయించినట్లు వివరించారు.
జైకొవ్-డి వ్యాక్సిన్(Zycov-D Zydus Cadila) దేశీయ పరిజ్ఞానంతో తయారైన రెండో టీకా. ప్రపంచంలోనే డీఎన్‌ఏ ఆధారంగా రూపొందిన తొలి వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం. ఈ టీకాను నేరుగా చర్మంలోకి ఎక్కిస్తారు. ఇందుకోసం సూది అవసరం ఉండదు. నొప్పి లేకుండా ఫార్మాజెట్ అనే సాధనం ద్వారా దీన్ని ఎక్కిస్తారు.
ఇదీ చూడండి: బంగారానికి ఎందుకంత డిమాండ్? ధర ఎవరు నిర్ణయిస్తారు?