ప్రపంచ కుబేరుడు, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌లో నిర్మించిన వార్నర్ ఎస్టేట్‌ను కొనుగోలు చేశారు. దీని విలువ 165 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1200 కోట్లు) ఉంటుందని స్థానిక మీడియా తెలిపింది.
రికార్డు ధరతో
ప్రముఖ హాలీవుడ్ నిర్మాత డేవిడ్ గిఫెన్ నుంచి ఆయన ఈ ఇంటిని కొనుగోలు చేశారు. ఈ డీల్‌తో లాస్ ఏంజిల్స్ ప్రాంతంలో ఇదే అత్యంత ఖరీదైన ఇల్లుగా నిలిచింది. గతంలో ప్రముఖ మీడియా అధినేత లాచ్లాన్ ముర్దోక్ 150 మిలియన్ డాలర్లు వెచ్చించి ఒక ఇంటిని కొనుగోలు చేశారు. తాజాగా బెజోస్ ఆ రికార్డును అధిగమించారు. అయితే బెజోస్ కొన్న ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికాలేదు.
జాక్ వార్నర్ నిర్మాణం
10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిని 1990లో గిఫెన్ 47.5 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీన్ని1937లో జాక్ వార్నర్ అనే వ్యక్తి నిర్మించాడు. తన భార్యతో విడాకుల అనంతరం బెజోస్ తన ప్రియురాలితో కలిసి కొత్త ఇంటి కోసం అన్వేషించినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ కొనుగోలు ప్రాముఖ్యం సంతరించుకొంది.
ఇదీ చూడండి: కొవిడ్-19 ఎఫెక్ట్: 'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్-2020' రద్దు