గత సంవత్సరం స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవడమే కాకుండా అంతకు మించిన స్థాయిలో రికవరీ కూడా అయ్యాయి. 2020 జనవరిలో 42వేల పాయింట్ల వద్ద ఉన్న బీఎస్ఈ-సెన్సెక్స్ కరోనా కారణంగా మార్చిలో 26 వేల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అయితే ఏడాది చివరి నాటికి రికార్డు స్థాయిలో రికవరీ అయ్యింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ కూడా అదే తరహాలో పుంజుకుంది.
2021 ఆరంభంలో జోరు..
2021 ఆరంభంలో కూడా సూచీలు రికార్డులను నమోదు చేశాయి. సెన్సెక్స్ తొలిసారి 50వేల మార్కును దాటింది. ఫిబ్రవరిలో ఏకంగా 52వేల మార్కును అందుకుంది. అయితే సెన్సెక్స్ ప్రస్తుతం 50వేల దిగువన కదలాడుతోంది. గత కొన్ని రోజులగా సూచీలు పడుతూ లేస్తూ సాగుతున్నాయి.
అమెరికా మార్కెట్ల పరుగుకు కారణాలు..
అంతర్జాతీయంగా మార్కెట్లు సానుకూలంగా ఉన్నప్పటికీ.. దేశీయ మార్కెట్లు ఒడుదొడుకుల్లో ఉన్నాయి. ఐటీ, ఫార్మా రంగాలు మంచి ప్రదర్శన కనబరుస్తున్నాయి. అమెరికాలో కొవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ ప్రారంభమవడం వల్ల అక్కడి మార్కెట్లలో సెంటిమెంట్ బాగుందని నిపుణులు చెబుతున్నారు. రూపాయి విలువ తగ్గటం, ధరల పెరుగుదల వల్ల లోహ రంగం మంచి ప్రదర్శన కనబరుస్తున్నట్లు వారు విశ్లేషిస్తున్నారు.
దేశీయ మార్కెట్లో సెకండ్ వేవ్ భయాలు..
భారత మార్కెట్లలో మాత్రం.. ప్రస్తుత అనిశ్చితికి కొవిడ్ కేసుల్లో భారీ పెరుగుదలే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. 'దేశీయంగా చాలా నగరాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. మళ్లీ ఎక్కువ మందికి కరోనా సోకటం వల్ల ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతోంది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ కొంత నెమ్మదించే అవకాశం ఉంది. ఈ కారణంతోనే సూచీలు పడుతూ లేస్తున్నాయ'ని వారు అంటున్నారు. దీనివల్ల అనుకున్న స్థాయిలో ఆర్థిక వృద్ధి నమోదవక పోవచ్చనే అంచనాలు.. దేశీయ మార్కెటను ఒడుదొడుకులకు గురి చేస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
"విదేశీ మార్కెట్లు మంచి ప్రదర్శన కనబరుస్తున్నప్పటకీ.. దేశీయ మార్కెట్లలో కరోనా వల్లనే అనిశ్చితి కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లు పడిపోయినట్లయితే ఇక్కడ మార్కెట్లలో కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం నమోదవుతోన్న కేసుల వల్ల ముందు అనుకున్న దానికంటే ఆర్థిక వ్యవస్థ రికవరీ మరింత ఆలస్యం కావచ్చు. ఇంకా చెప్పాలంటే మూడు నెలలు నెమ్మదించే అవకాశం ఉంది. ఈ ఏడాది వృద్ధి రేటు 12.5 శాతంగా నమోదవ్వచ్చని అంచనాలున్నాయి అయితే రెండో విడత కేసులు లేకుంటే.. ఈ స్థాయి వృద్ధి నమోదయ్యే అవకాశం ఉండేది. సెకండ్ వేవ్ ఉంది కాబట్టి వృద్ధి రేటు 7.5 శాతానికి పరిమితమవ్వచ్చు"
- సతీశ్ కంతేటి, జెన్ మనీ జాయింట్ ఎండీ
ప్రస్తుతం ఐటీ, ఫార్మా రంగ కంపెనీలతో పాటు లోహ కంపెనీలు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. అమెరికాలో కరోనా కేసులు తగ్గుతుండటం వల్ల ఆ దేశ మార్కెట్ మీద ఆధారపడిన ఐటీ రంగం సానుకూలంగా స్పందిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. రూపాయి బలహీన పడటం వల్ల లోహ రంగం లబ్ధి పొందుతోదంటున్నారు విశ్లేషకులు. కొవిడ్ విజృంభణ మళ్లీ తగ్గుముఖం పడితే సూచీలు రాణించే అవకాశం ఉందని వారు స్పష్టం చేస్తున్నారు.
ఇదీ చదవండి:జాక్మాపై చైనా ఆంక్షల కొరడా- భారీగా జరిమానా