వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ని పరిచయం చేస్తూ యూజర్స్‌ని ఆకట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉపయోగిస్తున్న ఇన్‌స్టా మెసేజింగ్ యాప్‌లో కొత్త వాటితో పాటు యూజర్స్‌కి తెలియని పాత ఫీచర్స్ కూడా ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైంది వాట్సాప్ ఖాతాకు ఫోన్ నంబర్ మార్చుకోవడం. ఇందుకోసం వాట్సాప్‌లో ఛేంజ్ నంబర్ అనే ఫీచర్ ఉంది. అదేంటీ..ఇది పాత ఫీచరే కదా..అనే అనుమానం కలగమానదు. కానీ మీరు ఫోన్ నంబర్ మార్చిన ప్రతిసారీ ఛాట్ హిస్టరీ పోతుంది. అలా ఛాట్ హిస్టరీ కోల్పోకుండా ఫోన్ నంబర్ ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫోన్ నంబర్ ఎలా మార్చుకోవాలంటే..
- ముందుగా వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్‌పై క్లిక్ చేయాలి. అందులో ఛేంజ్ నంబర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే మరో విండో ఓపెన్ అవుతుంది. అక్కడ నెక్ట్స్ అనే బటన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి మీ పాత ఫోన్ నంబర్, దాని కింద కొత్త ఫోన్ నంబర్ టైప్ చేయాలి.
- అప్పుడు మీ ఫోన్ నంబర్ మార్పు గురించి కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న అందరికీ తెలియాలా లేక మీరు ఛాట్ చేసే వారికి మాత్రమే తెలిస్తే చాలా లేక మీరు ఎంచుకున్న నంబర్లకి తెలిస్తే చాలా అని అడుగుతుంది. దాన్ని ఓకే చేసిన వెంటనే మీరు సభ్యులుగా ఉన్న గ్రూపులు, కాంటాక్ట్స్‌కి నంబర్ మార్చినట్లు సమాచారం వెళుతుంది. తర్వాత మీ నంబర్ మారినట్లు ధ్రువీకరించేందుకు ఎస్సెమ్మెస్ ద్వారా కోడ్ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే వాట్సాప్‌లో నంబర్ మార్చే ప్రక్రియ పూర్తవుతుంది.
మల్టీ డివైజ్ సపోర్ట్..
- యూజర్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మల్టీ డివైజ్ ఫీచర్ కూడా వచ్చేసింది. ఇప్పటికే ఆండ్రాయిడ్ యూజర్లకి బీటా వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఐఓఎస్ యూజర్స్‌కి కూడా బీటా వెర్షన్‌ను విడుదల చేసినట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్స్ వాట్సాప్ ఖాతా ఉపయోగిస్తున్న ఫోన్ పనిచేయకపోయినా మరో ఫోన్‌లో వాట్సాప్ యాక్సెస్ చేసుకోవచ్చు. అలానే వేర్వేరు డివైజ్‌లలో ఒకేసారి వాట్సాప్‌ను కనెక్ట్ చెయ్యొచ్చు.
- దానితో పాటు వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ కూడా తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఉన్న డిలీట్ మై అకౌంట్ స్థానంలో కొత్తగా లాగౌట్ ఫీచర్ రానుందని సమాచారం. దీని వల్ల యూజర్స్ వేర్వేరు డివైజ్‌లలో వాట్సాప్ లగౌట్ చేయడం మర్చిపోతే ఈ ఫీచర్ సాయంతో ఎక్కడి నుంచైనా లాగౌట్ కావొచ్చు.
- అలానే వాట్సాప్ మెన్షన్ బ్యాడ్జ్ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది. దీని సాయంతో వాట్సాప్ గ్రూపులలో స్నేహితులను ట్యాగ్ చెయ్యొచ్చు. ప్రస్తుతం బీటా వెర్షన్ అందుబాటులో ఉంది. త్వరలోనే యూజర్స్ అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాబీటాఇన్ఫో వెల్లడించింది. దీనితో పాటు టాటర్స్ ఎన్ టాట్స్ పేరుతో కొత్త స్టిక్కర్స్ ప్యాక్‌ను ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం విడుదల చేశారు. ఇటీవలే వాట్సాప్ వెబ్ కోసం ఫేస్, ఫింగర్ ప్రింట్ స్కాన్ పీచర్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దాని వల్ల అనుమతి లేకుండా వాట్సాప్ వెబ్ యాక్సెస్ చేయలేరు.
ఇదీ చదవండి:వినియోగదారుల గోప్యతపై వాట్సాప్, కేంద్రానికి నోటీసులు