కరోనా సంక్షోభంతో కార్పొరేట్లు ఇబ్బందులు ఎదుర్కొంటోన్న వేళ 'వ్యాక్సిన్ కింగ్' సైరస్ పూనావాలా సంపద అత్యంత వేగంగా పెరిగింది. తక్కువ సమయంలో ఎక్కువ ఆర్జించిన కుబేరుల్లో భారత్‌లో సైరస్ ప్రథమ స్థానంలో నిలువగా.. ప్రపంచవ్యాప్తంగా ఐదో స్థానంలో ఉన్నారని హురున్ పరిశోధన నివేదిక వెల్లడించింది.
కరోనా విజృంభణ మొదలైనప్పటి నుంచి 4 నెలల్లో సైరస్ సంపద 25 శాతం పెరిగింది. ఫలితంగా ప్రపంచ కుబేరుల జాబితాలో 57 స్థానాలు మెరుగుపరుచుకుని 86వ స్థానానికి చేరుకున్నారు. ఆయన స్థాపించిన 'సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా' వ్యాపార సామర్థ్యంతోనే ఇది సాధ్యమైందని హురున్ అంచనా వేసింది.
టీకా తయారీలో అగ్రగామి..
సైరస్ పూనావాలా మహారాష్ట్రలోని పుణె ఆధారిత వ్యాపార వేత్త. ఆయన సంస్థ సీరమ్.. ఇప్పటికే ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారుగా నిలిచింది. సీరమ్ టీకా సరఫరా, తయారీ సామర్థ్యం సైరస్ సంపద పెరుగుదలకు ముఖ్య కారణం.
ఇటీవలే సీరమ్ ఆస్ట్రాజెనికా అనే సంస్థతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన టీకాను100 కోట్ల డోసుల ఉత్పత్తి చేసేందుకు ఈ ఒప్పందం జరిగింది.
మొదటిస్థానంలోనే అంబానీ..
దేశంలో అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. కరోనా సంక్షోభంతో మొదటి రెండు నెలలు తీవ్రంగా నష్టపోయినా.. తిరిగి పుంజుకున్నారు. వాటాలు, షేర్ల అమ్మకం ద్వారా రూ.1.69 లక్షల కోట్లు ఆర్జించి రిలయన్స్‌ను రుణరహిత సంస్థగా నిలిపారు.
ఇందులో కొంత ఆలస్యం జరగటం వల్ల కరోనా పూర్వ స్థితితో పోలిస్తే ఒక శాతం సంపదను కోల్పోయారు అంబానీ. అయినప్పటికీ ప్రపంచ కుబేరుల్లో ఎనిమిదో స్థానాన్ని ఆక్రమించారు. భారత్‌లో మొదటిస్థానంలో కొనసాగుతున్నారు.
మొదటి ఏడు స్థానాల్లో..
- జెఫ్ బెజోస్
- బిల్ గేట్స్
- బెర్నాండ్ అనో
- వారెన్ బఫెట్
- మార్క్ జుకర్‌బర్గ్
- స్టీవ్ బాల్మర్
- అమాన్సియో ఒర్టెగా
తొలి 100 మంది కుబేరుల జాబితాలో.. అంబానీతో పాటు భారత్ నుంచి పూనావాలా, అదానీ, నాడర్ ఉన్నారు.