Wealth Creation Tips: నేడు పొదుపు చేస్తే, రేపటి రోజున అనుకోకుండా సంపాదన ఆగిపోతే.. ఆ డబ్బు ఉపయోగపడుతుంది అని చాలా మంది పొదుపు చేసేవారు. ఇది నిజమే. కానీ ప్రస్తుతం యువత ఆలోచనా ధోరణి మారింది. అత్యవసర పరిస్థితులు, పదవీవిరమణ వంటి వాటి కోసం డబ్బు ఆదా చేయాలి అనే రోజులు పోయాయి. ఆర్థిక స్వాతంత్ర్యం, సంపద సృష్టిపై దృష్టి పెడుతున్నారు. ఈ రెండు ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక స్వాతంత్ర్యం భవిష్యత్తులో సంపద ఆర్జనకు సహాయపడుతుంది.
ఆర్థిక స్వాతంత్య్రం ఉంటే అవసరమైనప్పుడు ఒకరిపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అయితే, సంపద సృష్టికి ఆర్థిక స్వాతంత్ర్యం ఒక్కటే సరిపోదు. సంపాదన కంటే ఖర్చులు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఖర్చుల కంటే పొదుపు ఎక్కువగా ఉండాలి. ఇలా పొదుపు చేసిన మొత్తాన్ని ఒక ప్రణాళిక ప్రకారం మదుపు చేయాలి. ఒకవేళ పొదుపు తక్కువగా ఉంటే సంపద సృష్టి సాధ్యం కాదా? అంటే సాధ్యమే అంటున్నారు నిపుణులు.
ఆర్థిక విషయాలలో రాణించాలంటే మానసిక ప్రశాంత చాలా అవసరం. పొదుపు టార్గెట్‌ను చేరుకునేందుకు తప్పనిసరి ఖర్చులను విస్మరించడం సరికాదు. దీని వల్ల ఒత్తిడి పెరగొచ్చు. డబ్బును చిన్న చిన్న మొత్తాలలో దీర్ఘకాలం పాటు నిలకడగా ఆదా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు అధిగమించడంతో పాటు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పొదుపు అలవాటు రెగ్యులర్ సేవింగ్స్ అవసరాన్ని తెలియజేయడంతో పాటు, కంఫర్ట్ జోన్‌లో ఉంటూనే అనవసరమైన ఖర్చులను నివారించడంలో సహాయపడుతుంది.
పొదుపు చేసేటప్పుడు డబ్బును లిక్విడ్ అసెట్స్ రూపంలో సురక్షిత పథకాలలో ఉంచినప్పటికీ, సంపద సృష్టికి మాత్రం పెట్టుబడులు పెట్టాలి. స్టాక్స్, రియల్ ఎస్టేట్, ఇతర స్థిర ఆస్తుల కొనుగోలు అనేది దీర్ఘకాల ప్రక్రియ. ఈ తరహా పెట్టుబడుల కోసం మెరుగైన దీర్ఘకాలిక ప్రణాళిక, వివిధ రకాల పెట్టుబడి మార్గాలపై అవగాహన అవసరం. కానీ పొదుపును మాత్రం నెలవారి బడ్జెట్‌ను అంచనా వేయడం, ఖర్చులను తగ్గించడం, పొదుపు లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం, ఆర్థిక ప్రాధాన్యతలను నిర్ణయించడం, వృద్ధిని ట్రాక్ చేయడంతో సులభంగా ప్రారంభించవచ్చు.
ఇందుకోసం మీకు ఏయే మార్గాల నుంచి ఆదాయం వస్తుందో అంచనా వేయండి. తప్పనిసరి నెలవారి ఖర్చులు ఇంటి అద్దె, నిత్యవసర వస్తువులు, వైద్య ఖర్చులు వంటి వాటికి కావలసిన నిధులను ప్రక్కన పెట్టండి. తప్పనిసరి కానీ ఇతర ఖర్చులు.. విహారయాత్రలు, సినిమాలు, రిసార్టెంట్ వంటి వాటికి కోసం కొంత మొత్తాన్ని తీసి మిగిలిన మొత్తాన్ని పొదుపు కోసం కూడబెట్టాలి.
పొదుపుపై బడ్జెట్ ప్రభావం చాలానే ఉంటుంది. ఎప్పుడైతే బడ్జెట్‌కు కట్టుబడి ఉంటామో అప్పుడే ప్రణాళిక ప్రకారం పొదుపు, పెట్టుబడులు చేయగలం. ఇందుకోసం 'ఏబీసీడీ' పొదుపు మంత్రాన్ని గుర్తించుకుంటే సులభంగా సంపదను సృష్టించవచ్చు. 'ఏబీసీడీ' పొదుపు మంత్రంలో
- 'ఏ' అంటే Arranging. ఆదాయం, ఖర్చులు, పొదుపును సబ్-హెడ్స్‌లో వర్గీకరించి ఎరేంజ్ చేయడం.
- 'బీ' అంటే Budgeting. ఆదాయంతో పొదుపు, ఖర్చులను సమతుల్యం చేసుకోవాలి.
- 'సీ' అంటే Consistent approach పొదుపుకు స్థిరమైన విధానం ఉండాలి.
- 'డీ' అంటే Developing. స్వల్ప-కాల పొదుపును దీర్ఘ-కాల పెట్టుబడులుగా వృద్ధి చేయాలి.
యువత సేవింగ్స్‌పై దృష్టిపెట్టాలి. కొంత కాలం పూర్తయ్యే సరికి నిర్ధిష్ట మొత్తం పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. ఆర్థిక వ్యవహాల నిర్వహణ విషయంలో చాలామంది గందరగోళానికి లోనవుతున్నారు. ఇలా జరగకుండా ఉండాలంటే మీ ఖర్చులను వేరువేరు భాగాలుగా వర్గీకరించేందుకు ప్రయత్నించాలి. సంపాదనలో కొంత భాగాన్ని పొదుపు కోసం కేటాయించాలి. ప్రతీ 15 రోజులకు ఒకసారి ఖర్చులను ట్రాక్ చేయాలి. అప్పుడు నెలలో మిగిలిన 15 రోజులలో ఖర్చును విశ్లేషించి అనవసరమైన ఖర్చులకు చెక్ పెట్టొచ్చు. చిన్న చిన్న ప్రయత్నాలే మనల్ని చాలా దూరం తీసుకెళ్తాయి. సంపాదించిన రూపాయిలో ప్రతీ పైసా విలువైనదే.
- డబ్బు పొదుపు కోసం కొన్ని చిట్కాలు..
- స్వీయ నియంత్రణ నేర్చుకోవాలి.
- పొదుపు అలవాటుకు ప్రాధాన్యత ఇవ్వాలి.
- సంపాదనను వేరువేరు భాగాలుగా వర్గీకరించండి.
- చిన్న చిన్న పెట్టుబడులతో ప్రారంభించడం, చెల్లింపులను విశ్లేషించడం నేర్చుకోండి.
- అత్యవసర నిధిని ప్రారంభించండి.
- సంపాదన, పొదుపు, ఖర్చుల మధ్య సమతుల్యత ఉండేలా చేసుకోవాలి. వీలైనంత వరకు అప్పు చేయకపోవడమే శ్రేయస్కరం.
- చిన్న చిన్న నీటి బిందువులే ప్రవాహంగా మారతాయి. అలాగే మనం ఈరోజు పొదుపు చేసిన చిన్న మొత్తాలే దీర్ఘకాలంలో సంపదగా మారతాయి.
ఇవీ చూడండి:
Edible oil self reliant: మన వంట నూనెకు మరో 15-20 ఏళ్లు ఆగాల్సిందే!
Gold mortgage: పసిడి రుణ వితరణలో బ్యాంకులు- ఎన్‌బీఎఫ్‌సీల పోటీ!