Vehicle scrapping in vahan: తుక్కుగా మార్చాలనుకున్న వాహనాల వివరాలను వాహన్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని కేంద్ర రహదారి, రవాణాశాఖ పేర్కొంది. ఈ విధివిధానాలపై 'రిజిస్ట్రేషన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ వెహికిల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ' పేరిట ముసాయిదా నిబంధనలు జారీ చేసింది. వీటిపై సలహాలు, సూచనలను 30 రోజుల్లోపు కేంద్ర రహదారి రవాణా శాఖకు పంపాలని సూచించింది. ఏ యజమాని అయినా కాలం తీరిన వాహనాన్ని తుక్కుగా మార్చాలనుకుంటే ఆ వాహనం వివరాలను వాహన్ పోర్టల్‌లో కానీ, లేదంటే తుక్కు వాహనాల కలెక్షన్ సెంటర్‌లో కానీ డిజిటల్‌గా నమోదు చేయాలి.
వివిధ కేసుల్లో పోలీసులు, ఇతర ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్న వాహనాలను కూడా తుక్కు కోసం అప్పగించొచ్చు. ఇలా అప్పగించిన వాహనం చోరీకి గురైందా, లేదంటే దాంతో ఇతర నేరాలకు ఏమైనా సంబంధం ఉందా? అన్న విషయాలను వాహన్ పోర్టల్ ద్వారా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో తనిఖీ చేయాల్సి ఉంటుంది. సదరు వాహనంపై బకాయిలేమీ ఉండకూడదు. అలాగే తాకట్టులో, బ్లాక్‌లిస్ట్‌లో ఉండకూడదు. ఈ కొలమానాలన్నీ అధిగమించిన వాహనాలనే తుక్కుకు స్వీకరిస్తారు. ఇదే సమయంలో వాహన యజమాని పాన్ నెంబర్, కేన్సిల్డ్ బ్యాంకు చెక్, వాహనాన్ని తుక్కుకు అప్పగిస్తున్నట్లుగా స్టాంప్ పేపర్‌పై రాసిన అధీకృత లేఖ కాపీలను కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు ఒరిజినల్ ఆర్‌సీ, యజమాని ఫొటో గుర్తింపు కార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రం, ఓ ఫొటో ఇవ్వాలి. ఒకసారి ఈ దరఖాస్తు సమర్పించాక అది నిరభ్యంతర పత్రం కోసం ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయానికి వెళ్తుంది. అక్కడ నోడ్యూ సర్టిఫికెట్ జారీ అయ్యాక వాహనం తుక్కు కోసం యజమాని అప్‌లోడ్ చేసిన దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది.
ఏ రాష్ట్రంలో ఏర్పాటుచేసిన తుక్కు కేంద్రంలోనైనా ఇతర రాష్ట్రాల్లో నమోదైన వాహనాలనూ తుక్కు కోసం స్వీకరించవచ్చు. అయితే ఈ ప్రక్రియకు సంబంధించిన అన్ని వివరాలనూ వాహన్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలి. తుక్కుకు వాహనాన్ని ఇచ్చిన యజమాని కొత్త వాహనం కొనుగోలు సమయంలో ప్రోత్సాహకాలు, రాయితీలు పొందాలంటే పాత వాహనాన్ని తుక్కుకు సమర్పించినట్లు నిరూపించే సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్‌ను తప్పనిసరిగా చూపాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్ రెండేళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది.
ఇదీ చదవండి: ప్రధాని ముందే గవర్నర్‌పై అజిత్ పవార్ ఘాటు వ్యాఖ్యలు