పేరు మార్చుకొన్నా.. ఫేస్‌బుక్‌ను వివాదాలు వీడటంలేదు. చికాగోకు చెందిన టెక్ సంస్థ 'మెటా కంపెనీ' న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. ఫేస్‌బుక్ రీబ్రాండింగ్ (Meta Facebook) పేరిట తన పేరు(మెటా)ను, జీవనాధారాన్ని దొంగిలించిందని ఆరోపించింది. ఈ మేరకు మెటా కంపెనీ వ్యవస్థాపకుడు నేట్ స్క్యూలిక్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఫేస్‌బుక్ (Facebook News) తన సంస్థను కొనుగోలు చేయడంలో విఫలం కావడంతో.. మీడియా శక్తిని ఉపయోగించి కనుమరుగు చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఫేస్‌బుక్ ఎప్పుడూ చెప్పేదొకటి.. చేసేదొకటి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రకటనను బహిరంగ వివరణగా భావించాలని ఆయన వెల్లడించారు. గత మూడు నెలలుగా కంపెనీని చౌకగా విక్రయించాలని ఫేస్‌బుక్ లాయర్లు వెంటాడుతున్నారని నేట్ వెల్లడించారు. తాము ఫేస్‌బుక్ ఆఫర్‌ను తిరస్కరించినట్లు వెల్లడించారు. అక్టోబర్ 28వ తేదీన పేరును మెటాగా మారుస్తున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 'మెటా కంపెనీ' కోర్టులో న్యాయపోరాటం చేయాలని నిర్ణయించింది.
ఫేస్‌బుక్ పేరు మారుస్తున్నట్లు కంపెనీ వార్షిక సమావేశంలో సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల వెల్లడించారు. ఫేస్‌బుక్‌తో పాటు కంపెనీకి చెందిన ఇతర సామాజిక మాధ్యమాలు ఇన్‌స్టాగ్రామ్, మెసేంజర్, వాట్సాప్ పేర్లలో ఎలాంటి మార్పు ఉండబోదని కంపెనీ తెలిపింది. ఫేస్‌బుక్‌కు చెందిన అన్ని కంపెనీలకు 'మెటా' మాతృసంస్థగా ఉండబోతుందని ఆయన చెప్పారు.
ఇదీ చూడండి: 15 రోజుల ట్రయల్ ఆఫర్‌తో స్మార్ట్‌ఫోన్.. నచ్చితే కంటిన్యూ.. లేదంటే రిటర్న్!