ప్రముఖ సామాజిక మాధ్యమ వేదికగా ట్విట్టర్ సేవలకు అంతరాయం ఏర్పడింది. శనివారం సాయంత్రం ట్విట్టర్లో లాగిన్ సమస్య తలెత్తింది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్విట్టర్ ఖాతాదారులు పలు సమస్యలు ఎదుర్కొన్నారు. కొందరికి ట్వీట్స్ లోడింగ్ ఫెయిల్‌కాగా, మరికొందరు డెస్క్‌టాప్‌లో లాగ్ ఔట్ ఎర్రర్స్ వచ్చాయి.
ట్విట్టర్లో ఏదైనా పోస్ట్ చేస్తుంటే 'మరొకసారి ప్రయత్నించండి', 'ఈ సమయంలో ట్వీట్స్‌ను అందించలేకపోతున్నాం. దయ చేసి కొంత సేపటి తర్వాత ప్రయత్నించండి' అని సందేశాలు వచ్చినట్లు వినియోగదారులు పేర్కొన్నారు. అయితే, ఈ సమస్య కేవలం డెస్క్‌టాప్ వినియోగదారులకు మాత్రమే ఎదురైంది. మొబైల్ యాప్‌లో ఎలాంటి సమస్యలు ఎదురు కాలేదు.
శనివారం ఉదయం కూడా ట్విట్టర్ వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్విట్టర్ లాగిన్ కాలేకపోయారు. దీనిపై సంస్థ సమాధానం కూడా ఇచ్చింది. 'మీలో కొందరు ట్వీట్స్ లోడింగ్‌లో సమస్య ఎదుర్కొని ఉంటారు. ఆ సమస్యను పరిష్కరిస్తున్నాం. త్వరలోనే సేవలను పునరుద్ధరిస్తాం' అని ఈ రోజు ఉదయం ట్విట్టర్ ప్రకటించింది.
మళ్లీ సాయంత్రానికి డెస్క్‌టాప్ వినియోగదారులు లాగిన్ సమస్యను ఎదుర్కొన్నారు.
ఇదీ చదవండి : స్పేస్‌ఎక్స్‌కు నాసా కీలక కాంట్రాక్టు