వచ్చే ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల విలువైన సొరంగ (టన్నెల్స్) పనులు చేపట్టనున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అన్ని వేళలా అక్కరకు వచ్చేలా వ్యూహాత్మక ప్రదేశాల్లో సొరంగాలు నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
సొరంగ నిర్మాణ పనుల కోసం సమర్థులైన బిడ్డర్లకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. వారు చిన్నవారైనా, పెద్దవారైనా పట్టింపు లేదని స్పష్టం చేశారు.
నిజానికి పెద్ద బిడ్డర్లు... ప్రాజెక్టును చేజిక్కించుకున్నాక, కొన్ని పనులను చిన్న బిడ్డర్లతో చేయిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. అందుకే అందరికీ అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం సాంకేతిక, ఆర్థిక అర్హతలతోపాటు పారామితులను కూడా సడలించాల్సిన అవసరం ఉందని గడ్కరీ అన్నారు.
వర్క్‌షాప్
అసోచాం, నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'భూగర్భ నిర్మాణం, టన్నెలింగ్' వర్క్‌షాప్‌లో గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిశ్రమ పెద్దలు, స్టాక్హోల్డర్స్, సీనియర్ అధికారులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో గడ్కరీ.. సొరంగాల నిర్మాణ ఆవశ్యకతపై పై వ్యాఖ్యలు చేశారు.
సొరంగాల నిర్మాణ పనులు సమగ్ర పద్ధతిలో చేయాల్సిన అవసరముందని గడ్కరీ పేర్కొన్నారు. అయితే ఖర్చులు తగ్గించి, నాణ్యతను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
కొత్త విధానం
ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ నిర్వహణ కోసం ఒక కొత్త విధానం త్వరలో అమల్లోకి వస్తుందని నితిన్ గడ్కరీ వెల్లడించారు. రహదారుల నిర్మాణం విషయంలో, తప్పుడు ప్రాజెక్ట్ రిపోర్టులు (డీపీఆర్) వల్ల చాలా నష్టం జరిగిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు.
భారత్‌లో ఏటా జరుగుతున్న 5 లక్షల ప్రమాదాల్లో... జాతీయ రహదారుల్లో జరుగుతున్న ప్రమాదాలు 40 శాతం వరకు ఉన్నాయని గడ్కరీ తెలిపారు. ఇందులో 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి లోపభూయిష్టమైన డీపీఆర్ ప్రధాన కారణమని ఆయన అన్నారు.
ఇదీ చూడండి: రూ.1200 కోట్ల విలువైన ఎస్టేట్ కొన్న జెఫ్ బెజోస్!