మన దగ్గర ఉన్నదానికన్నా అధికంగా ఖర్చు పెట్టకూడదు. కానీ, క్రెడిట్ కార్డుల వల్ల మన దగ్గర లేని డబ్బును కూడా ముందుగానే ఖర్చు చేసేస్తుంటాం. తీరా బిల్లులు చెల్లించాల్సిన సమయం వచ్చేనాటికి ఏం చేయాలో అర్థం కాక, కనీస చెల్లింపు లేదా.. నిర్ణీత మొత్తం కన్నా అధికంగా ఉన్న కొనుగోలును నెలసరి సమాన వాయిదా (ఈఎంఐ)లోకి మార్చేస్తాం. నిజానికీ ఈ రెండూ పొరపాటే. మనకు తెలియకుండానే అప్పుల ఊబిలోకి దింపేస్తుంటాయి. మన నెల జీతం కన్నా, క్రెడిట్ కార్డు బిల్లు అధికంగా వచ్చిందంటే.. డబ్బు విషయంలో మనం సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదనే అర్థం. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు భవిష్యత్తు అవసరాలకు పొదుపు చేసేందుకుగానీ, లేదా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకునేందుకు, కుటుంబ ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకూ వీలుపడదు. ఇలాంటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
- ముందుగా చేయాల్సిందేమిటంటే.. కనీస చెల్లింపు అనే అవకాశాన్ని వినియోగించుకోవడం మానేయండి. ఇలా ‘కనీసం’ చెల్లిస్తూ వెళ్లడం వల్ల అప్పు భారం పెరిగిపోతుంది. బాకీ ఉన్న మొత్తంపై వడ్డీ చెల్లించాలి. ఇది ఎప్పటికప్పుడు భారంగా మారిపోతుంది. దీనికన్నా.. మీ పొదుపు మొత్తాలను బయటకు తీయండి. వాటితో కార్డు బిల్లులు చెల్లించేయండి. దీనివల్ల మీపై వడ్డీ భారం తగ్గడమే కాకుండా.. క్రెడిట్ స్కోరుకు కూడా ఇబ్బంది కలగదు.
- వాయిదాల్లోకి మార్చుకునేందుకు ప్రయత్నించడం వల్ల కూడా నెలనెలా భారం పడుతుంది. ప్రాసెసింగ్ ఫీజుతోపాటు, వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం పడుతుంది.
- ఒకసారి బిల్లు పూర్తిగా చెల్లించేశాక.. మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఉండండి. నెలకు రూ.5వేలైనా అదనంగా పొదుపు చేసేందుకు ప్రయత్నించండి. దీనివల్ల మీకు అత్యవసర నిధి సమకూరుతుంది. అవసరం వచ్చినప్పుడు ఈ డబ్బునే వాడుకునే వీలవుతుంది. అనవసర ఖర్చు తగ్గితే.. ఆర్థిక క్రమశిక్షణ మెరుగుపడుతుంది.
- ఒక కార్డు చాలు.. మరీ కావాలనుకుంటే.. మరోటి. ఇలా రెండు కార్డులు ఉంటే చాలు. కార్డులు ఎక్కువవుతున్న కొద్దీ కష్టాలు కూడా పెరుగుతాయి. వీలైతే కార్డులన్నింటికీ ఒక్క రూపాయి బాకీ లేకుండా చెల్లించి, గరిష్ఠ పరిమితి ఉన్న రెండు కార్డులను ఉంచుకోండి. కొన్నాళ్లపాటు డెబిట్ కార్డును మాత్రమే అలవాటు చేసుకుంటే.. అప్పుల తిప్పలు తప్పుతాయి. ఆ తర్వాత నెమ్మదిగా క్రెడిట్ కార్డును వాడవచ్చు. అదీ మీరు కచ్చితంగా బిల్లు చెల్లిస్తామని నమ్మకం వచ్చాకే!
ఇదీ చదవండి: సిరి: వ్యక్తిగత రుణం.. ఇవన్నీ తెలుసుకున్నాకే!