నేడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మొదలుకానున్నాయి. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు.ఆర్థిక మందగమనం, ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతు సమస్యలు, పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనల నేపథ్యంలో సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈసారి బడ్జెట్ సమావేశాలను రెండు విడతల్లో నిర్వహించనున్నారు. రేపటి నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి విడత, మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి.
45 బిల్లులు
ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రెండు ఆర్డినెన్సులు, ఏడు ఆర్థిక బిల్లులు సహా మొత్తం 45 బిల్లులను ఈ పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
విపక్షాలు సిద్ధం
వివిధ సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో విపక్షాలు ఇదే అంశాన్ని డిమాండ్ చేశాయి. తాము లేవనెత్తే అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం అనుమతించాలని కోరాయి.
కేంద్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకుండా పార్లమెంటు సమావేశాల్లో కేవలం బిల్లుల ఆమోదంపైనే దృష్టి సారిస్తోందని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ ఆరోపించారు. కేంద్రం పార్లమెంటు సమావేశాలు జరిగే రోజులను క్రమంగా కుదిస్తోందని ఆయన విమర్శించారు. నిర్బంధంలో ఉన్న జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాను పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు.
తిప్పికొట్టిన కేంద్రం
విపక్షాల ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తిప్పికొట్టింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంటు ప్రజాస్వామ్య బద్ధంగా ఆమోదించిందని, దీనిపై జరిగే ఆందోళనలను విపక్షాలు రెచ్చగొడుతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. పార్లమెంటులో విపక్షాలు ఏ అంశం లేవనెత్తినా చర్చకు అనుమతిస్తామని తెలిపారు. అన్ని అంశాలపై కేవలం మామూలు చర్చ మాత్రమే కాకుండా నిర్మాణాత్మక చర్చ జరగాలని అఖిలపక్ష భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారని వెల్లడించారు.
క్షీణిస్తున్న దేశ ఆర్థిక రంగంపై సమావేశాల్లో దృష్టి సారించాలన్న విపక్షాల సలహాలను ప్రధాని స్వాగతించారని తెలిపారు. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని భారత్‌కు మేలు చేసే చర్యల గురించి చర్చిద్దామని మోదీ సూచించినట్లు ప్రహ్లాద్ జోషి తెలిపారు.
వరుస భేటీలు
రాజ్యసభలోని వివిధ పార్టీ పక్షనేతలతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేతృత్వంలో ఆయన నివాసంలో ఉదయం సమావేశం జరగనుంది.
పార్లమెంటు లైబ్రరీలో మధ్యాహ్నం 2 గంటలకు భాజపా కార్యనిర్వాహక కమిటీ భేటీ జరగనుంది. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు ఎన్డీఏ నేతలు సమావేశం కానున్నారు.
పాలక విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమైన నేపథ్యంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదీ చూడండి: వాళ్లు నాకు హామీ ఇచ్చారు: ఓం బిర్లా