ఇటీవల ఏకంగా జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి పసిడి ధరలు. అయితే దేశీయంగా డిమాండు తగ్గడం.. స్టాక్ మార్కెట్లు కాస్త కోలుకోవడం వంటి కారణాల వల్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ బంగారం ధరల జోరుకు ఈ పరిస్థితులు పెద్ద ఆటంకం కాదంటున్నారు నిపుణులు. ఏడాదిన్నర లోపు ధరలు పెరిగే అవకాశముందని విశ్లేషిస్తున్నారు.
ఓ అంచనా ప్రకారం వచ్చే ఏడాది జనవరి నాటికి మళ్లీ అత్యధిక రికార్డు స్థాయి వద్ద పసిడి ధరలు ఉండొచ్చని నిపుణుల అంచనా. దేశీయంగా ప్రస్తుతం (నిన్నటి ధరల ఆధారంగా) 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 39,240గా ఉంది.
హెచ్చుతగ్గులున్నా..
ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా బంగారంపై పెట్టుబడి స్వల్ప కాలంతో పాటు దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే మధ్యలో కొన్ని హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. గోల్డ్ ఈటీఎఫ్‌లు లాంటి ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో కొనుగోలు చేయటం వల్ల తరుగుదలను అధిగమించవచ్చని సూచిస్తున్నారు. స్టాక్ మార్కెట్లు కాస్త ఒడుదొడుకుల్లో పయనిస్తున్న దృష్ట్యా బంగారంపై పెట్టుబడి పెట్టుకోవటం ప్రస్తుత పరిస్థితుల్లో మేలైన విషయమేనని అభిప్రాయపడుతున్నారు.
ధరలు ఎందుకు పెరుగుతాయంటే..
బంగారం ధర పెరుగుదలకు దేశీయ, అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి. ఆర్థిక మాంద్యం వస్తుందన్న భయాలతో ప్రజలు, ప్రభుత్వాలు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావించి కొనుగోలు చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
అమెరికాతో సహా ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో వడ్డీ రేట్లు తగ్గిపోవటం వల్ల.. బాండ్లు, పొదుపులపై రాబడులు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో స్థిరమైన ఆధాయం కోసం పసిడిపై పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా ధరలు పెరిగే అవకాశముందని నిపుణుల అంచనా. రూపాయి ఒడుదొడుకులు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయని అంటున్నారు.
ఇదీ చూడండి : 2.1బిలియన్ డాలర్లకు ఫిట్‌బిట్‌ను కొనుగోలు చేసిన గూగుల్