ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో రూ. 6.8 లక్షల కోట్లను నగదీకరించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి ప్రభుత్వం సూచించే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. 'జీడీపీలో 10 శాతానికి సమానమైన ప్యాకేజీలో 7.3 శాతం మేర వివిధ మార్గాల్లో నిధులు సమకూర్చవచ్చు. మిగతా 2.7 శాతం లేదా రూ.6.8 లక్షల కోట్లను మాత్రం ఆర్‌బీఐనే నగదీకరించాల్సి వస్తుంద'ని తన నివేదికలో వివరించింది. ఆ నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు..
- ద్రవ్య సమతౌల్యం భారీగా దెబ్బతినకుండా ఈ మొత్తాన్ని ప్రభుత్వం సమీకరించాల్సి ఉంది.
- ఆర్‌బీఐ ఇప్పటికే 250 బేసిస్ పాయింట్ల మేర ఎల్‌టీఆర్‌ఓలు, టీఎల్‌టీఆర్‌ఓలు, సీఆర్‌ఆర్ కోత, రుణ గవాక్షాల ద్వారా నిధులను ఏర్పాటు చేసిందని బీఓఎఫ్‌ఓ ఆర్థికవేత్తలు ఇంద్రనీల్ సేన్ గుప్తా, ఆస్తా గుడ్వానీ అభిప్రాయపడుతున్నారు.
- బుధవారం ఆర్థిక మంత్రి ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ, విద్యుత్ రంగం, ఎన్‌బీఎఫ్‌సీలకు ప్రకటించిన రూ.3 లక్షల కోట్ల ప్యాకేజీలో రూ.23,200 కోట్ల మేరే ద్రవ్య ప్రభావం పడొచ్చు.
- జూన్ వరకు లాక్‌డౌన్ పొడిగిస్తే కనుక 2020-21లో ఆర్థిక వ్యవస్థ 10 బేసిస్ పాయింట్ల మేర క్షీణించవచ్చు. అంతక్రితం వృద్ధిరేటు అంచనా 1.5 శాతమన్న సంగతి తెలిసిందే. అయితే 2021-22 వృద్ధి లక్ష్యాన్ని మాత్రం బీఓఎఫ్‌ఏ 0.5 శాతం పెంచి 8.1 శాతానికి చేర్చింది.
- జూన్ త్రైమాసికంలో వృద్ధి 12% క్షీణించవచ్చు. ఒక వేళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, కరోనా వ్యాక్సిన్ కోసం ఏడాది పాటు వేచిచూడాల్సి వస్తే మాత్రం జీడీపీ 4 శాతం మేర క్షీణించవచ్చు.
- అక్టోబరు మొదట్లో ఆర్‌బీఐ రివర్స్ రెపోను 50-75 బేసిస్ పాయింట్ల మేర కోత వేయొచ్చు.
ఇదీ చూడండి: వందే భారత్ ఫేజ్-2 బుకింగ్స్ ప్రారంభం