ఇటీవల ఫుడ్ డెలివరీలకు డిమాండ్ భారీగా తగ్గిన నేపథ్యంలో ఆన్లైన్ మద్యం విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాయి స్విగ్గీ, జోమాటో లాంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్. ఇందులో భాగంగా ఇప్పటికే ఝార్ఖండ్, ఒడిశాల్లో మద్యం ఆన్లైన్ విక్రయాలు జరుపుతున్న స్విగ్గీ ఇప్పుడు బంగాల్కూ ఈ సేవలు విస్తరించింది. బంగాల్లో మధ్యం హోం డెలివరీ సేవలు ప్రారంభిస్తున్నట్లు స్విగ్గీ గురువారం ప్రకటించింది. తొలుత కోల్‌కతా, సిలిగురి నగరాల నుంచి ఈ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. రాష్ట్రంలో 24 పట్టణాలకు ఈ సేవలు విస్తరించాలని భావిస్తున్నట్లు తెలిపింది.
కరోనా నేపథ్యంలో మద్యం హోం డెలివరీ ద్వారా ప్రజలు బయటికి రాకుండా ఉంటారనే ఉద్దేశంతో ప్రభుత్వాలు కూడా ఇందుకు సానుకూలంగా స్పందిస్తున్నాయి.
నిబంధనలు పాటిస్తూ.. వినియోగదారుల చిరునామా, వయస్సు తదితర వివరాలు నిర్ధరించుకున్నాకే వారికి మద్యం డెలివరీ చేస్తామని స్విగ్గీ ప్రకటించింది. ఇందుకోసం డెలివరీ, మద్యం రిటైల్ భాగస్వాములకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ ఇచ్చినట్లు తెలిపింది. ఆల్కాహాల్ ఆన్లైన్ విక్రయాలు సాఫీగా జరిగేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.
పరిమితికి మించి మద్యం దొరకదు..
ఆన్లైన్లో మద్యం ఆర్డర్ ఇచ్చేందుకు తమ వినియోగదారుడు.. ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు, సెల్ఫీ ఫొటోను అప్లోడ్ చేసి వయస్సు ధ్రువీకరకించాల్సి ఉంటుందని స్విగ్గీ తెలిపింది. వన్‌టైమ్ ఇన్స్టంట్ ఏజ్ వెరిఫికేషన్ పేరుతో ఈ ప్రక్రియ జరుగుతుంది.
సగటున ఒక వినియోగదారుడికి ఎంత మద్యం విక్రయించాలనే విషయంపైనా బంగాల్ ప్రభుత్వం పరిమితులు విధించినట్లు స్విగ్గీ తెలిపింది. దీనితో పరిమితి దాటిన తర్వాత వినియోగదారులు ఆర్డర్ ఇవ్వలేరని స్పష్టం చేసింది. ఈ సేవలు పొందాలుకునే వారు స్విగ్గీ యాప్‌ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది.