దలాల్ స్ట్రీట్‌లో మంగళవారం కూడా బుల్ జోరు కొనసాగింది. బీఎస్ఈ-సెన్సెక్స్ భారీగా 680 పాయింట్లు బలపడి.. జీవన కాల గరిష్ఠ స్థాయి అయిన 43,278 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 170 పాయింట్ల వృద్ధితో సరికొత్త రికార్డు స్థాయి అయిన 12,631 వద్దకు చేరింది. మార్కెట్లు లాభాలను నమోదు చేయడం ఇది వరుసగా ఏడో సెషన్.
తమ కరోనా వ్యాక్సిన్ సానుకూల ఫలితాలు ఇస్తున్నట్లు ఫైజర్ ఫార్మా చేసిన ప్రకటన ప్రపంచ మార్కెట్లకు కొత్త ఊపునిచ్చింది. దీనికి తోడు అమెరికా ఎన్నికల్లో బైడెన్ గెలుపు వంటి అంతర్జాతీయ సానుకూలతలు దేశీయ మార్కెట్లను ముందుకు నడిపించాయి.
బిహార్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎన్డీఏ ఆధిక్యంలో కొనసాగుతుండటం మదుపరుల సెంటిమెంట్‌పై సానుకూల ప్రభావం చూపినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఆర్థిక, చమురు, మౌలిక వసతుల కంపెనీల షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి. ఐటీ, ఆటో షేర్లు కాస్త డీలా పడ్డాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 43,316 (జీవనకాల గరిష్ఠం)పాయింట్ల అత్యధిక స్థాయి, 42,660 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 12,642 పాయింట్ల గరిష్ఠ స్థాయి(జీవనకాల గరిష్ఠం), 12,475 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
బజాజ్ ఫినాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్&టీ, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్‌టెక్, ఇన్ఫోసిస్, నెస్లే, సన్‌ఫార్మా, టీసీఎస్ షేర్లు నష్టపోయాయి.
ఇతర మార్కెట్లు..
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై మినహా టోక్యో, సియోల్, హాంకాంగ్ సూచీలూ లాభాలను నమోదు చేశాయి.
రూపాయి, ముడి చమురు
కరెన్సీ మార్కెట్లో రూపాయి 3 పైసలు తగ్గింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 74.18 వద్ద స్థిరపడింది.
ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 1.42 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 43 డాలర్లుగా ఉంది.