స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 154 పాయింట్లు బలపడి జీవనకాల గరిష్ఠమైన 46,253 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి సరికొత్త జీవనకాల రికార్డు స్థాయి అయిన 13,558 వద్దకు చేరింది.
విదేశీ మదుపరుల పెట్టుబడుల జోరు స్టాక్ మార్కెట్ల లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. బ్యాంకింగ్, లోహ షేర్ల సానుకూలతలూ లాభాలకు దన్నుగా నిలిచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
నిజానికి సెషన్ ప్రారంభంలో భారీగా పుంజుకున్న సూచీలు.. ద్రవ్యోల్బణం గణాంకాల ప్రతికూలతలు, లాభాల స్వీకరణ వంటి కారణాలతో చివరకు కాస్త నెమ్మదించాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 46,373 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 45,951 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 13,597 పాయింట్ల గరిష్ఠ స్థాయి(సరికొత్త రికార్డు స్థాయి), 13,472 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఓఎన్జీసీ, ఎల్&టీ, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్ షేర్లు లాభాలను గడించాయి.
ఎం&ఎం, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, బజాజ్ ఫినాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, టోక్యో సూచీలు లాభాలను గడించాయి. సియోల్, హాంకాంగ్ సూచీలు నష్టాలను నమోదు చేశాయి.
ఇదీ చూడండి:9 నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం