కరోనా మహమ్మారి(Corona virus) రెండో దశ కొనసాగుతోంది. ఇంకా ఎన్ని విడతలుగా వస్తుందన్న దానిపై స్పష్టత లేదు. మూడో దశ(Third wave) ఉంటుందని నిపుణులు, శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇది ఎక్కువగా చిన్న పిల్లలపై ప్రభావం చూపుతుందని వారు భావిస్తున్నారు. పిల్లలపైనే భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. కరోనా నుంచి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులపై ఉంటుంది. వీరిని కరోనా నుంచి కాపాడుకునే క్రమంలో ఆర్థిక పరిస్థితి దిగజారకుండా చూసుకోవాలి.
కొవిడ్ సోకినట్లయితే భారీగా ఖర్చు అవుతున్న దృష్ట్యా మూడో వేవ్‌కు ఆర్థికంగా సంసిద్ధంగా ఉండేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవచ్చో తెలుసుకుందాం..
అత్యవసర నిధి
సాధారణంగానే అత్యవసర పరిస్థితి ఎప్పుడైనా ఏర్పడవచ్చు. కొవిడ్ మహమ్మారి కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో దీనికి ఇంకా అవకాశాలు ఎక్కువ. అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు… రుణం కోసం ప్రయత్నించటం, ఇతర మార్గాలు అన్వేషించటం కంటే కుటుంబం వద్దే అత్యవసర నిధిని సమకూర్చుకోవటం ఉత్తమం.
అత్యవసర నిధిని సరిపడేంత సమకూర్చుకోవాలి. పిల్లల ఫీజులు, రోజు వారీ ఖర్చులు, అద్దె, బీమా ప్రీమియం, ఈఎమ్ఐ తదితర ఖర్చులను ఆరు నెలల వరకు కవరేజీ ఉండే విధంగా ఇది ఉండాలి. కొవిడ్ పరిస్థితులకే కాకుండా.. సాధారణ పరిస్థితుల్లో కూడా అత్యవసర నిధి అనేది ఉపయోగపడుతుంది.
ఆరోగ్య బీమా..
సాధారణంగా ఆరోగ్య ఖర్చులు ప్రస్తుత రోజుల్లో పెరిగిపోయాయి. కొవిడ్ మహమ్మారి సోకినట్లయితే ఆస్పత్రి ఖర్చులు భరించాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రతను బట్టి ఖర్చు ఉంటుంది. కొన్ని సార్లు భారీగా కూడా వెచ్చించాల్సి రావొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య బీమా ఆదుకుంటుంది.
కుటుంబంలో అందరికి వర్తించేలా ఆరోగ్య బీమా లేని వారు కొత్తగా పాలసీ తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. ఒకవేళ ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ కవరేజీ మొత్తం సరిపోదు అని భావిస్తున్నట్లయితే… కొవిడ్ ప్రామాణిక పాలసీలైన కరోనా కవచ్ పాలసీని తీసుకోవచ్చని వారు సూచిస్తున్నారు. ఈ పాలసీలో కొవిడ్ సంబంధించి అన్ని రకాల ఖర్చులకు కవరేజీ ఉంటుంది.
రుణ అర్హతను పెంచుకోండి.
కొవిడ్ ఎలాంటి మలుపు తీసుకుంటుదన్నది ఇంకా స్పష్టత లేదు. కొవిడ్ సోకితే ఎంత ఖర్చువుతుందన్నది కూడా ఊహించని పరిస్థితి ఉండొచ్చు. ఇలాంటి సందర్భాల్లో రుణం తీసుకోవాల్సి కూడా రావొచ్చు. వ్యక్తిగత రుణం అనేది ఎలాంటి తనఖా లేకుండా అందుతుంది. అంతేకాకుండా తనఖా రుణాలు కూడా తీసుకోవచ్చు.
రుణ అర్హతను పెంచుకోవటం ద్వారా అవసరం ఉన్నప్పుడు రుణం త్వరగా పొందవచ్చు. రుణ అర్హతకు క్రెడిట్ స్కోరు, రిపేమెంట్స్ హిస్టరీ చాలా ముఖ్యమైనవి. క్రెడిట్ స్కోరు తరచూ చెక్ చేసుకోవాలి. ఏదైన తప్పులు గమనించినట్లయితే క్రెడిట్ బ్యూరోలను సంప్రదించాలి. రుణాలను తిరిగి చెల్లించటం వల్ల క్రెడిట్ స్కోరు పెరుగుతుంది. కాబట్టి సమయానికి రుణాలను తిరిగి చెల్లించే ప్రయత్నం చేయాలి.
ఒకే సారి ఎక్కువ క్రెడిట్ ఎంక్వైరీలు ఉంటే క్రెడిట్ స్కోరు తగ్గిపోతుంది. ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి.
క్రెడిట్ లిమిట్ పెంపు
మహమ్మారి వల్ల ఎప్పుడైన డబ్బులు అవసరం పడొచ్చు. క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే లిమిట్ మేర ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉపయోగించుకోవచ్చు. కొన్ని సార్లు లిమిట్ కంటే ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి రావొచ్చు. ఇలాంటి సందర్భానికి సిద్ధంగా ఉండే విధంగా లిమిట్‌ను పెంచుకోవటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
క్రెడిట్ కార్డు లిమిట్ ఆధారంగా రుణం కూడా పొందటం చాలా సులభం. ఆన్లైన్ ద్వారానే ఇలాంటి రుణాలను పొందవచ్చు. క్రెడిట్ కార్డు రుణాలపై ఎక్కువ వడ్డీ రేటు ఉన్నప్పటికీ ఆపదలో ఆదుకునేందుకు క్రెడిట్ కార్డులు ముందు వరుసలో ఉంటాయి.
ఇదీ చదవండి:ఆరోగ్య బీమా..ఖర్చు కాదు..పెట్టుబడే..