దేశంలో ఉక్కు ధరలు భారీగా పెరిగాయి. హాట్ రోల్డ్ కాయిల్(హెచ్‌ఆర్‌సీ) ఉక్కు టన్నుకు రూ.4 వేలు, కోల్డ్ రోల్డ్ కాయిల్(సీఆర్‌సీ) ఉక్కు రూ.4,900 వరకు పెంచినట్లు పరిశ్రమ వర్గాలు గురువారం వెల్లడించాయి. సవరించిన ధరల ప్రకారం.. టన్ను హెచ్‌ఆర్‌సీ స్టీల్ ధర రూ.70-71వేలు పలుకుతోంది. ఇక సీఆర్‌సీ ఉక్కు టన్నుకు రూ.83-84 వేల వరకు లభించనుంది.
హెచ్‌ఆర్‌సీ, సీఆర్‌సీ ఉక్కును వివిధ ఉపకరణాలతో పాటు.. ఆటో, నిర్మాణం వంటి పరిశ్రమలలో ఉపయోగిస్తారు. ఈ రంగాలకు ఉక్కు ప్రధాన ముడిసరుకు అయినందున.. వాహనాల ధరలు, వినియోగ వస్తువులు, ఇతర నిర్మాణ వ్యయాలు ప్రభావితం అవుతాయని నిపుణులు భావిస్తున్నారు.
సెయిల్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్, జేఎస్‌పీఎల్, ఏఎంఎన్ఎస్ వంటి సంస్థలు ఉక్కు తయారీ సంస్థల్లో ప్రధానమైనవి. ఇవి సంయుక్తంగా 55 శాతం ఉక్కును ఉత్పత్తి చేస్తున్నాయి.
తాజా ధరల పెరుగుదలపై సెయిల్ అధికారిని సంప్రదించగా స్పందించేందుకు ఆయన నిరాకరించారు. అయితే.. ముడి పదార్థాల ధర పెరుగుదల కారణంగా అంతర్జాతీయ స్టీల్ ధరలు అధికం అయ్యాయని జేఎస్‌పీఎల్ అధికారి ఒకరు తెలిపారు. దేశీయ ఉక్కు ధరల పెరుగుదలకు ఇది ఓ కారణమని వివరించారు.
ఇదీ చదవండి: తగ్గిన ఉక్కు ఉత్పత్తి.. వినియోగదారులపై ధరల మోత