రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) చేపట్టిన సత్వర దిద్దుబాటు ప్రణాళిక(పీసీఏ) కింద బ్యాంకుల్లోకి ఆర్థిక శాఖ రూ.14,500 కోట్ల మేర నిధులు చొప్పించనుంది. ఆయా బ్యాంకుల ఆర్థిక స్థితి మెరుగుపరచేందుకు వచ్చే కొద్ది రోజుల్లో ఈ నిధులు ఇవ్వనుంది. ప్రస్తుతం పీసీఏ కింద ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకులకు రుణాలు, యాజమాన్య పరిహారాలు, డైరెక్టర్ల ఫీజుల విషయంలో పలు షరతులున్నాయి. మూలధనం ఇవ్వడానికి బ్యాంకులను ఆర్థిక శాఖ ఇప్పటికే ఎంపిక చేసినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
తాజా మూలధన సాయం వల్ల ఆ బ్యాంకులు పీసీఏ చట్రం నుంచి బయటకు వచ్చే అవకాశం కలుగుతుంది. ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బీఓబీ, కెనరా బ్యాంక్, యూబీఐ, ఇండియన్ బ్యాంక్‌లు ఇప్పటికే పలు మార్గాల్లో నిధులను సమీకరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధనం కింద రూ.20,000 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అత్యధికంగా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ గతేడాది నవంబరులో రూ.5,500 కోట్లు పొందగలిగింది.
ఇదీ చూడండి: సాంకేతిక సంస్థల్లో 'ఫిన్‌టెక్'లదే హవా!