దేశంలో మిఠాయిలు, కారా పదార్థాల వ్యాపారంలో సంఘటితరంగ వాటా 30 శాతంలోపే ఉంటుంది. అసంఘటిత రంగంలోనే అత్యధికులు వీటి తయారీ, విక్రయాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కొవిడ్ సంక్షోభానంతరం వీటి తయారీ కేంద్రాల్లో పనిచేసే వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లడం, అమ్మకాలు గణనీయంగా తగ్గడంతో.. సంస్థలు ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి.
గతేడాది రూ.లక్ష కోట్ల టర్నోవర్ సాధించిన సంస్థలు, ఈ ఏడాది 60,000-65,000 కోట్ల మేర చేయొచ్చని ఫెడరేషన్ అభిప్రాయ పడుతుంటే, మరింత తగ్గొచ్చని విక్రేతలు పేర్కొంటున్నారు. లాక్‌డౌన్ ముందు పరిస్థితులతో పోలిస్తే 30-40% వ్యాపారమే జరుగుతోందని, మరో 7-8 నెలలు ఇదే ధోరణి కొనసాగొచ్చని అంచనా వేస్తున్నారు. వ్యాధి వ్యాపిస్తుందనే భయంతో బయటకు వచ్చి తినేందుకు ప్రజలు భయపడుతున్నారని తెలిపారు.
అమ్మకాలు తగ్గేందుకు
- కొవిడ్ కేసుల వ్యాప్తి తీవ్రత పెరగడం, వేడుకలపై కఠిన పరిమితులు
- ఉద్యోగాలు-వ్యాపారాలు సరిగా లేక ప్రజల ఆదాయం తగ్గడం
- ఇళ్లలో భిన్నరకాలు సొంతగా చేసుకోవడం గణనీయంగా పెరగడం ఆరోగ్య భద్రతపై నమ్మకం ఉంటేనే లాక్‌డౌన్ సడలించాక అత్యవసరమైన సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాలను ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ఆహార పదార్థాల్లో బిస్కెట్ల వంటి ప్యాక్డ్ ఆహారాన్ని కొంటున్నారు తప్ప బర్గర్, పిజ్జాలను తినేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆరోగ్య సంరక్షణ జాగ్రత్తలు పాటిస్తారని నమ్మకం కలిగిన దుకాణాల్లోనే కొంతవరకు స్వీట్స్, కేక్‌లు కొంటున్నారు. కానీ అసంఘటిత రంగ దుకాణదార్ల పరిస్థితి మరీ క్లిష్టంగా ఉంది. కనీసం నిర్వహణ వ్యయమైనా ఆర్జించగలమా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాల్సిందే
"ఐరోపా, సింగపూర్ వంటి దేశాల్లోనూ లాక్‌డౌన్ సడలించాక స్నాక్స్ దుకాణాలకు ఇదే స్థితి ఎదురైంది. అక్కడి ప్రభుత్వాలు అద్దెలు, సిబ్బంది వేతనాల్లో 50-30% చొప్పున అందించి ఆదుకున్నాయి. అద్దెలు కట్టకపోతే, భవన యజమానులు ఒప్పుకోవడం లేదు. శానిటైజర్, మాస్క్‌లు, పీపీఈ కిట్‌ల వంటివి అందిస్తూ, కొద్దిమంది కార్మికులతోనే పనిచేయడం వల్ల వ్యయాలు పెరుగుతున్నాయి. మనదేశంలోనూ ప్రభుత్వం గ్రాంటు మంజూరు చేసి ఆదుకోవాలి. లేకపోతే అత్యధిక దుకాణాలు మూతబడి, ఉద్యోగ కోతలూ సంభవిస్తాయి" అని కేఎస్ బేకర్స్ యజమాని సందీప్ వివరించారు.
నమ్మకం పెంచుకోవడంపై బ్రాండ్ల దృష్టి
"లాక్‌డౌన్ వల్ల ఇంట్లోనే కలిసి వంటలు చేసుకోవడంలో ఆనందంగా గడిపారు. భిన్న రుచులను ఆస్వాదించారు. ముఖ్యంగా వ్యాధి నిరోధకశక్తిని పెంచే పదార్థాలపై దృష్టి అధికంగా ఉంది. ఇప్పుడు వీరు బయటి ఆహార పదార్థాలు కొనాలంటే ఆరోగ్యానికి భంగం కలిగించవనే విశ్వాసం కలగాలి. ఇందుకోసం ఎఫ్‌ఎంసీజీ బ్రాండ్లు వ్యాధి నిరోధకశక్తిని పెంచే పాలు, పప్పుదినుసులు, ఇతర పదార్థాల తయారీలో నిమగ్నమయ్యాయి. రెస్టారెంట్లు, స్విగ్గీ-జొమాటో వంటి డెలివరీ సంస్థలు కూడా భరోసా కలిగించే చర్యలు చేపట్టాయి. ఇవన్నీ వార్తా పత్రికలు, టీవీ ఛానళ్లు, డిజిటల్ మాధ్యమాల్లోనూ విస్తృతంగా ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నాయని మా సర్వేలో తేలింది" అని హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే జాన్‌రైజ్ అడ్వర్‌టైజింగ్ అండ్ బ్రాండింగ్ డైరెక్టర్ సుమన్ గద్దె తెలిపారు.
రూ.లక్ష కోట్లు: దేశంలో గత ఆర్థిక సంవత్సరంలో స్వీట్స్, స్నాక్స్ వ్యాపారం
రూ.65,000 కోట్లు: ప్రస్తుత ఆర్థిక సంవత్సర అమ్మకాలపై ఫెడరేషన్ ఆఫ్ స్వీట్స్ అండ్ నమ్‌కీన్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ అంచనా.