అంతరిక్షంలోకి ఉపగ్రహాలను తీసుకువెళ్లటంలో రాకెట్లది ఎంతో కీలకమైన పాత్ర. ఇప్పటి వరకూ మనదేశంలో ఇస్రో తప్పించి రాకెట్లు తయారు చేసిన సంస్థ మరొకటేదీ లేదు. అదీ ప్రైవేటు రంగంలో. తొలిసారిగా అటువంటి ప్రయత్నాన్ని హైదరాబాద్‌కు చెందిన అంకురం స్కైరూట్ ఏవియేషన్ చేస్తోంది. ‘నాకు చిన్నప్పటి నుంచి సొంతంగా ఒక వ్యాపార సంస్థ స్థాపించాలనే ఆశ ఉండేది. ఐఐటీలో చేరాక ఆ ఆశ ఇంకా బలపడింది. ఇస్రోలో ఉద్యోగం చేస్తున్నప్పుడు దాన్ని ఆచరణలోకి తీసుకువచ్చే అవకాశం కలిగింది’- అని ‘స్కైరూట్ ఏరోస్పేస్’ సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ పవన్ కుమార్ చందన వివరించారు. వచ్చే ఏడాదికి తన ‘విక్రమ్-1’ రాకెట్‌ను సిద్ధం చేసి చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లటానికి కసరత్తు చేస్తోంది సంస్థ. దీనికి ఇ-కామర్స్ సంస్థ మింత్ర వ్యవస్థాపకుడు, ప్రస్తుతం క్యూర్‌ఫిట్ సీఈఓ అయిన ముకేశ్ బన్సల్, సోలార్ ఇండస్ట్రీస్, నీరజ్ అరోరా (వాట్సాప్ మాజీ సీబీఓ), వరల్డ్‌క్వాంట్ వెంచర్స్, గ్రాఫ్ వెంచర్స్ వంటి అగ్రశేణి ఇన్వెస్టర్లు, సంస్థలు మూలధనాన్ని సమకూర్చాయి.
ఆలోచనకు అంకురం..
పవన్ కుమార్ చందన ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ (మెకానికల్ ఇంజనీరింగ్) చేశారు. కేంపస్ రిక్రూట్‌మెంట్‌లో ఇస్రోలో శాస్త్రవేత్త ఉద్యోగం సంపాదించారు. తనలాంటి ఆలోచనా ధోరణే ఉన్న నాగ భరత్ డాక ఇస్రోలో సహ- శాస్త్రవేత్తగా, ‘రూమ్ మేట్’ గా రావటంతో సొంతంగా వ్యాపారవేత్తగా ఎదగాలనే తన కల నిజమయ్యే అవకాశం కలిగిందన్నారాయన. స్కైరూట్ ఏరోస్పేస్ సహ-వ్యవస్థాపకుడు, సీఓఓ నాగ భరత్ డాక ఐఐటీ మద్రాస్‌లో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) చేసి ఇస్రోలో శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. ఇద్దరూ కొన్నేళ్ల పాటు ఇస్రోలో రాకెట్ సైన్స్ మీద పట్టు సంపాదించారు. ‘‘త్రివేండ్రంలోని ఇస్రో కేంపస్ ఎంతో బాగుంటుంది, మంచి ఉద్యోగం, మంచి జీతం, ఇక్కడే రిటైరై పోవచ్చు అనిపించేది నాకు తొలినాళ్లలో. కానీ వ్యాపారవేత్త కావాలని నాలో అంతర్లీనంగా ఉన్న ఆలోచన నెమ్మదిగా బయటకు వచ్చింది. అందుకు నాకు తెలిసిన అంతరిక్ష శాస్త్రమే అవకాశం కల్పించింది’’ అని పవన్ కుమార్ పేర్కొన్నారు.
స్కైరూట్ ఏరోస్పేస్ ఏర్పాటు ఇలా..
‘ఇస్రో ప్రధానంగా పెద్ద ఉపగ్రహాలు ప్రయోగించటానికి అవసరమైన భారీ రాకెట్లు ఉత్పత్తి చేస్తుంది. చిన్న, మధ్యస్థాయి ఉపగ్రహాలకు అనువైన రాకెట్లను ఉత్పత్తి చేయటం తక్కువ. ఇక్కడే తమకు వ్యాపారావకాశం ఉంద’ని గమనించినట్లు పవన్, భరత్ తెలిపారు. ‘ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రైవేటు వ్యాపార సంస్థలు, యూనివర్సిటీలు, ప్రయోగశాలలు చిన్న, మధ్యస్థాయి ఉపగ్రహాలు ప్రయోగిస్తుంటాయి. పెద్ద రాకెట్లు 50 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉంటాయి. 20-30 మీటర్ల పొడవు ఉండేవి చిన్న, మధ్యస్థాయి రాకెట్లు. ప్రపంచవ్యాప్తంగా రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్‌కు 80 శాతం చిన్న రాకెట్లే కావాలి. చిన్న రాకెట్లతో వాణిజ్య అవసరాల కోసం ప్రస్తుతం 500 ఉపగ్రహాలు ప్రయోగిస్తున్నారు. వచ్చే పదేళ్లలో ఈ సంఖ్య 20,000 కు చేరుకుంటుందని అంచనా. ఇదే మాకు వ్యాపార అవకాశమని అనిపించింది. ఈ ఆలోచన మా మదిలో మెదులుతున్నప్పుడు కాకతాళీయంగా ముఖేష్ బన్సల్‌ను కలిశాం. ఆయన వెంటనే మద్దతు పలికారు. ప్రాథమిక మూలధనాన్ని సమకూర్చారు. దాంతో మేమిద్దరం ‘ఇస్రో’ ఉద్యోగాన్ని వదిలేసి స్కైరూట్ ఏరోస్పేస్‌ను ఏర్పాటు చేశాం’ అని వెల్లడించారు పవన్.
విజయవంతంగా క్రయోజనిక్ రాకెట్
‘ఇతర దేశాల్లో రాకెట్లు తయారు చేయటం ఎంతో ఖరీదైన పని. దాంతో పోల్చితే మేం స్వల్ప ఖర్చులోనే రాకెట్ ఉత్పత్తి చేయగలం. తద్వారా ప్రపంచ వ్యాప్త మార్కెట్ మాకు అందుబాటులోకి వస్తుంది. అంతరిక్ష కార్యకలాపాల అంతర్జాతీయ విపణి పరిమాణం ఇప్పుడు 400 బిలియన్ డాలర్లు ఉంటే, సమీప భవిష్యత్తులో ఇది 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. మనదేశంలో ప్రైవేటు రంగంలో అంతరిక్ష కార్యకలాపాల ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాన్నే ఆవిష్కరించింది. ఇవన్నీ మాకు కలిసి వచ్చే అంశాలే’ అని ఆయన వివరించారు. స్కైరూట్ ఏరోస్పేస్ ఈ మధ్యే పూర్తిస్థాయి క్రయోజనిక్ రాకెట్ ఇంజన్‌ను విజయవంతంగా పరీక్షించింది. దీన్ని విక్రమ్-2 రాకెట్లో వినియోగిస్తారు. వచ్చే ఏడాది సొంత రాకెట్‌ను ప్రయోగించటానికి సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఈ పరీక్ష విజయవంతం కావటం తమ విశ్వాసాన్ని పెంచిందని తెలిపారు.
లక్ష్యం అదే..
త్వరలో ‘యూనికార్న్’గా స్కైరూట్ ఆవిర్భవిస్తుందా? అనే ప్రశ్నకు, సంస్థాగత విలువ కంటే త్వరగా రాకెట్ ప్రయోగాలు మొదలు పెట్టాలనేదే తమ లక్ష్యమని పవన్ వివరించారు. ఉబర్, ఓలాలు కార్లలో ప్రయాణికులను తీసుకువెళ్లాయి, మేం ఆకాశానికి రాకెట్లతో ఉపగ్రహాలు మోసుకెళ్తాం- అని నాగ భరత్ అన్నారు. తమతో 100 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వచ్చే రెండేళ్లలో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని తెలిపారు. ఇస్రో సదుపాయాలు ఉపయోగించుకోవటానికి, ఒప్పందం కుదుర్చుకున్న తొలి ప్రైవేటు సంస్థ తమదేనని చెప్పారు.
ఇదీ చదవండి: Minister Harish Rao : 'నా తల్లిదండ్రులకు క్యాన్సర్.. ఆ బాధేంటో నాకు తెలుసు'